డిసెంబర్ 8న వైసీపీ నేతృత్వంలో భారీ ఎత్తున బీసీ సదస్సు

26-11-2022 Sat 16:23 | Andhra
  • విజయవాడలో బీసీ సభను నిర్వహించనున్న వైసీపీ
  • సభకు జగన్ హాజరయ్యే అవకాశం ఉందన్న మంత్రి చెల్లుబోయిన
  • బీసీలకు చంద్రబాబు చేసిన ద్రోహాన్ని వివరిస్తామని వ్యాఖ్య
YSRCP BC Sabha on Dec 8th
వచ్చే నెల 8వ తేదీన విజయవాడలో భారీ ఎత్తున బీసీ సభను వైసీపీ నిర్వహించబోతోంది. ఎన్నికల నేపథ్యంలో బీసీలపై వైసీపీ ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. ఈరోజు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బీసీ మంత్రులు, పార్టీ కీలక నేతలు భేటీ అయ్యారు. 

ఈ సందర్భంగా బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతూ... బీసీ సభకు ముఖ్యమంత్రి జగన్ కూడా హాజరయ్యే అవకాశం ఉందని చెప్పారు. బీసీల జీవన విధానంలో మార్పులు తీసుకురావడానికి జగన్ ఒక డిక్లరేషన్ ను ప్రకటించారని తెలిపారు. 139 బీసీ కులాలను ఒకే గొడుకు కిందకు తీసుకొచ్చి సంక్షేమ ఫలాలను అందించారని కొనియాడాడు.

బీసీలకు టీడీపీ చేసిన ద్రోహాన్ని ప్రజలకు వివరిస్తామని మంత్రి చెప్పారు. వైసీపీ ప్రభుత్వం బీసీల ఆత్మగౌరవాన్ని ఎలా పెంపొందించిందో తెలియజేస్తామని అన్నారు. బీసీ వర్గాలన్నీ వైసీపీకి మద్దతు ఇవ్వడంతో చంద్రబాబు కేవలం 23 స్థానాలకు పరిమితమయ్యారని చెప్పారు.