గుజరాత్ అల్లర్ల ‘గుణపాఠం’ కామెంట్లపై అమిత్​ షా వర్సెస్​ అసదుద్దీన్​ ఓవైసీ

26-11-2022 Sat 14:10 | National
  • ప్రస్తుతం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ఇరువురు నేతలు
  • 2002 గోద్రా అల్లర్ల కారకులకు బీజేపీ గట్టి గుణపాఠం చేప్పిందన్న కేంద్ర హోం మంత్రి
  • బిల్కిస్ బానో రేపిస్టులను జైలు నుంచి విడుదల చేయడమే నేర్చిన గుణపాఠమా? అంటూ ఎద్దేవా
Lesson you taught in 2002 Owaisi responds to Amit Shah remark on Gujarat riots
2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్లకు బీజేపీ గుణపాఠం చెప్పిందన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై ఎఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గుజరాత్ తొలి విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ బహిరంగ సభలో మాట్లాడిన.. అమిత్ షా గుజరాత్ గోద్రా అల్లర్ల గురించి ప్రస్తావించారు. కాంగ్రెస్ పాలనలో గుజరాత్‌లో తరచూ మతోన్మాద దాడులు, అల్లర్లు జరిగేవన్నారు. అందుకే 2002 అల్లర్లు జరిగాయని ఆరోపణలు చేశారు. అల్లర్లకు కారకులైన వారికి ఆనాడే బీజేపీ గుణపాఠం చెప్పారని వివరించారు. దాంతో, సంఘవిద్రోహ శక్తులు హింసా మార్గాన్ని వదిలిపెట్టాయని అన్నారు. 

మతపరమైన హింసలో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుని, గుజరాత్‌లో శాశ్వత శాంతిని బీజేపీ స్థాపించిందని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఓవైసీ .. కేంద్ర హోమంత్రి వ్యాఖ్యలపై  స్పందించారు. ‘నేను కేంద్ర హోంమంత్రికి చెప్పాలనుకుంటున్నాను. 2002లో మీరు నేర్పిన పాఠం ఏమిటంటే.. బిల్కిస్ బానో రేపిస్టులను జైలు నుంచి వదిలిపెట్టాలనే గుణపాఠం నేర్పారు. బిల్కిస్ బానో మూడేళ్ల కూతురు హంతకులకు విముక్తి ప్రసాదించాలని నేర్పించారు. ఎహెసాన్ జాఫ్రీని చంపేశారు. ఇలా మీరు నేర్పిన ఏ పాఠం గుర్తుంచుకోవాలి? హోం మంత్రి వాళ్లకు గుణపాఠం చెప్పారని అంటున్నారు. ఢిల్లీ మతకల్లోలాలు జరిగినప్పుడు మీరు ఏ పాఠం నేర్పారు అమిత్ షా?’ అంటూ అసదుద్దీన్ ప్రశ్నించారు.