సుధీర్ బాబు సినిమాకు హాలీవుడ్ టచ్

26-11-2022 Sat 13:47 | Entertainment
  • ‘హంట్’ చిత్రానికి హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ స్టంట్స్
  • సినిమాలకు ఈ యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్ అవుతాయంటున్న చిత్ర బృందం
  • ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో సినిమా
Sudheer Babu biggest Support base Hollywood
సుధీర్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హిట్లు, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా విలక్షణమైన కథలను ఎంచుకుంటూ వరుసగా సినిమాలు చేస్తూ తనదైన ముద్ర వేస్తున్నాడు. ఇటీవల ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఇప్పుడు ‘హంట్’ అనే యాక్షన్ థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు. భవ్య క్రియేషన్స్ నిర్విస్తున్న ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు మహేష్ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో సుధీర్ బాబు పోలీస్‌ ఆఫీసర్‌‌గా నటిస్తున్నాడు. ఈ సినిమాకు హాలీవుడ్ టచ్ కూడా ఇస్తున్నాడు సుధీర్. ఇందులో యాక్షన్ సీన్స్ చాలా కొత్తగా ఉండబోతున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో వీటిని తెరకెక్కించారు.

హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ రేనాడ్ ఫవెరో, బ్రయాన్ విజియర్ ఈ సినిమాకు ఫైట్స్ కంపోజ్ చేశారు. ఈ ఇద్దరూ త్వరలో విడుదల కాబోతున్న ‘జాన్ విక్ 4’ అనే హాలీవుడ్ సినిమా కోసం పని చేశారు. ఈ స్టంట్స్ హంట్ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయని చిత్ర బృందం చెబుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే విడుదల తేదీకి సంబంధించిన ప్రకటన వెలువడనుంది.

కాగా, ఇప్పటికే విడుదలైన టీజర్‌‌తో పాటు ‘పాపతో పైలం’ అంటూ అప్సరారాణి చేసిన స్పెషల్‌ సాంగ్‌కు చక్కని స్పందన లభించింది. ఈ చిత్రంలో శ్రీకాంత్, భరత్, మైమ్ గోపి, కబీర్ దుహన్ సింగ్, గోపరాజు రమణ, చిత్రాశుక్ల తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.