చుట్టూ మనుషులున్నా రూ.10 లక్షల నెక్లెస్ కొట్టేసింది.. గోరఖ్ పూర్ లో ఓ మహిళ చేతివాటం.. వీడియో ఇదిగో!

26-11-2022 Sat 13:41 | Offbeat
  • నగల దుకాణంలో విలువైన నగ చోరీ చేసిన మహిళ
  • సేల్స్ మెన్ ను మాటల్లో పెట్టి నగను చీరలో దాచిన వైనం
  • సీసీటీవీ కెమెరాలో రికార్డయిన ఘటన
  • సంబంధిత వీడియో సోషల్ మీడియాలో వైరల్
 a customer stole gold necklace at a jewelery shop in gorakhpur
కస్టమర్ లా నగల దుకాణానికి వెళ్లిన ఓ మహిళ చూపించిన చేతివాటం ఆ షాపులోని సీసీటీవీ కెమెరాలో చిక్కింది. ప్రతీక్షణం అప్రమత్తంగా ఉండే షాపు సిబ్బందిని, నగలు కొనడానికి వచ్చిన ఇతర కస్టమర్ల కళ్లుగప్పి విలువైన నగతో ఉడాయించింది. ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లో జరిగిన ఈ చోరీకి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దొంగిలించిన నగ విలువ సుమారు పది లక్షల దాకా ఉంటుందని షాపు యజమాని మీడియాకు తెలిపారు. సదరు మహిళా దొంగపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గోరఖ్ పూర్ సిటీలోని జాతేపూర్ ఏరియాలో ఉన్న ఓ నగల దుకాణానికి ఈ నెల 17న ఓ మహిళ వచ్చింది. మంచి నెక్లెస్ కావాలని, మీ దగ్గర ఉన్న డిజైన్లు చూపించాలని అడగగా.. సిబ్బంది ఒక్కో నగను తీసి చూపించారు. ఆకుపచ్చ చీర, నల్ల కళ్లద్దాలు, మాస్క్ తో ఉన్న ఆ మహిళ ఒక్కో నగను పరిశీలనగా చూడసాగింది. సిబ్బందిని మాటల్లో పెట్టి ఎవరూ చూడకుండా ఓ నగను తన ఒడిలో దాచింది. బాక్స్ తో సహా ఆ నగను జాగ్రత్త చేసుకుని, షాపులో నగలు తనకు నచ్చలేదని చెప్పి వెళ్లిపోయింది. 

అప్పటికి ఆ దొంగతనం విషయం బయటపడలేదు. తర్వాత లెక్కల్లో తేడా రావడంతో నగలను పరిశీలించగా.. పది లక్షల విలువైన నగ ఒకటి మిస్సయిందని గుర్తించారు. తొలుత ఇది షాపులోని సిబ్బంది పనేనని అనుమానించినా.. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా సదరు మహిళ చేసిన నిర్వాకం బయటపడింది. దీంతో షాపు యజమాని పోలీసులను ఆశ్రయించాడు.