అందరికీ క్రమశిక్షణ నేర్పే రూల్ బుక్ మన రాజ్యాంగం: జగన్

26-11-2022 Sat 12:52 | Andhra
  • భారత రాజ్యాంగం చాలా గొప్పదన్న జగన్
  • సామాజిక వర్గాల చరిత్రను తిరగరాసిందని కితాబు
  • వచ్చే ఏడాది ఏప్రిల్ లో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని వెల్లడి
Jagan praises the greatness of our constitution
భారత రాజ్యాంగం చాలా గొప్పదని ఏపీ సీఎం జగన్ అన్నారు. 80 దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి మన రాజ్యాంగాన్ని రూపొందించారని చెప్పారు. అందరికీ క్రమశిక్షణ నేర్పే రూల్ బుక్ మన రాజ్యాంగమని కొనియాడారు. 72 ఏళ్లుగా మన రాజ్యాంగం అణగారిన సామాజిక వర్గాల చరిత్రను తిరగరాసిందని చెప్పారు. 

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకల్లో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిత్రపటానికి వీరు నివాళి అర్పించారు. 

వచ్చే ఏడాది ఏప్రిల్ లో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నామని జగన్ చెప్పారు. గ్రామ స్వరాజ్యానికి రూపకల్పన చేసిన ప్రభుత్వం తమదని.. సచివాలయాల వ్యవస్థతో సమూల మార్పులను తీసుకొచ్చామని అన్నారు. నామినేటెడ్ పదవుల్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు 50 శాతం ఇస్తున్నామని చెప్పారు. మంత్రి మండలిలో 70 శాతం మంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలే ఉన్నారని తెలిపారు. అసెంబ్లీ స్పీకర్ గా బీసీని, శాసనమండలి ఛైర్మన్ గా ఎస్సీని, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ గా మైనార్టీ వ్యక్తిని నియమించామని చెప్పారు.