అలా చేస్తే నేను తప్పకుండా కొత్త ఫోన్ తీసుకొస్తా: ఎలాన్ మస్క్

26-11-2022 Sat 12:37 | International
  • గూగుల్, యాపిల్ తమ యాప్ స్టోర్ల నుంచి ట్విట్టర్ ను తొలగిస్తే? అంటూ ప్రశ్న  
  • అలా జరగదని కచ్చితంగా అనుకుంటున్నానన్న మస్క్   
  • మరో ఆప్షన్ లేకపోతే ఫోన్ తేవడం ఖాయమని వెల్లడి 
Elon Musk says if Apple and Google ban Twitter he will make his own smartphone
‘నా రూపే సెపరేటు’ ఇది ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు సరిగ్గా అతుకుతుంది. ఒకరిని అనుకరించకుండా, తనదైన బాటలో ఆయన అడుగులు వేస్తుంటారు. అందుకే ప్రపంచ మేధావుల్లో ఒకడిగా ఆయనకు గుర్తింపు ఉంది. ఇటీవలే రూ.3.6 లక్షల కోట్లకు ట్విట్టర్ ను కొనుగోలు చేసిన మస్క్ దాన్ని రైట్ ట్రాక్ లో పెట్టే పనిలో మునిగి ఉన్నారు. ఈ తరుణంలో ట్విట్టర్ పై ఓ యూజర్ ఆసక్తికరమైన ప్రశ్న సంధించగా, మస్క్ అదే విధంగా బదులిచ్చారు.

గూగుల్ ప్లే స్టోర్, యాపిల్  స్టోర్ నుంచి ట్విట్టర్ యాప్ ను తొలగిస్తే ఏం చేస్తారు? అని ఓ యూజర్ నుంచి మస్క్ కు ప్రశ్న ఎదురైంది. కొత్త ఫోన్ ను మార్కెట్ కు పరిచయం చేస్తారా? అని అడిగారు. ‘‘అలా జరగదని నేను కచ్చితంగా అనుకుంటున్నాను. కానీ, మరో ఇతర చాయిస్ లేనప్పుడు నేను ప్రత్యామ్నాయ ఫోన్ ను తీసుకొస్తాను’’ అని మస్క్ రిప్లయ్ ఇచ్చారు. దీనికి నథింగ్ కంపెనీ వ్యవస్థాపకుడు కార్ల్ పీ స్పందించారు. మస్క్ తదుపరి ఏం చేస్తారో చూడాలన్న ఆసక్తితో ఉన్నట్టు పేర్కొన్నారు. 

గూగుల్, యాపిల్ తమ యాప్ స్టోర్లలో లాంచ్ చేసే యాప్ డెవలపర్ల నుంచి లోగడ 30 శాతం కమీషన్ తీసుకునేవి, తర్వాత 15 శాతానికి తగ్గించాయి. దీన్ని ఎలాన్ మస్క్ గతంలో విమర్శించారు. ఇంటర్నెట్ పై ట్యాక్స్ గా అభివర్ణించారు.