టీడీపీకి గుడ్ బై చెప్పనున్న గంటా శ్రీనివాసరావు?

26-11-2022 Sat 12:32 | Andhra
  • కొంత కాలంగా టీడీపీకి దూరంగా ఉంటున్న గంటా శ్రీనివాసరావు
  • వైసీపీలో చేరికపై బంధువులు, సన్నిహితులతో చర్చలు
  • డిసెంబర్ తొలి వారంలో వైసీపీలో చేరే అవకాశం
Ganta Srinivasa Rao to join YSRCP
టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. గంటా పార్టీ మారుతారనే విషయాన్ని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గతంలోనే బహిరంగంగా చెప్పారు. అయితే ఆయన చెప్పినట్టుగా గంటా పార్టీ మారనప్పటికీ... టీడీపీకి మాత్రం దూరంగానే ఉంటూ వస్తున్నారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఉత్తరాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నప్పటికీ... గంటా మాత్రం ఈ విషయంపై మౌనంగానే ఉంటున్నారు. 

ఇప్పుడు పార్టీ మారేందుకు గంటా సిద్ధమయినట్టు తెలుస్తోంది. ఈ అంశంపై తన బంధువులతో కూడా ఆయన చర్చించినట్టు సమాచారం. కొన్ని రోజుల క్రితం సినీ నటుడు చిరంజీవిని ఆయన కలిశారు. ఈ సందర్భంగా పార్టీ మార్పుపై చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. గంటా వైసీపీలో చేరేందుకు అంతా సిద్ధమయిందని చెపుతున్నారు. డిసెంబర్ 1వ తేదీన తన జన్మదినం తర్వాత వైసీపీలో ఆయన చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. డిసెంబర్ తొలి వారంలో విశాఖలో జగన్ సభ జరగనుంది. ఈ సందర్భంగా ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోవచ్చని చెపుతున్నారు. దీనిపై త్వరలోనే పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.