ప్రపంచకప్​ నుంచి నిష్క్రమించిన ఖతార్​ జట్టు.. చెత్త రికార్డు ఖతాలో వేసుకున్న ఆతిథ్య జట్టు

26-11-2022 Sat 12:05 | Sports
  • వరుసగా రెండో మ్యాచ్ లోనూ చిత్తయిన ఖతార్
  • 1–3తో సెనెగెల్ చేతిలో పరాజయం
  • మరో మ్యాచ్ మిగిలుండగానే గ్రూప్ దశలోనే వైదొలిగిన ఖతార్
  • ఈ టోర్నీ నుంచి  అధికారికంగా వైదొలిగిన తొలి జట్టు అతిథ్య దేశమే
Qatar eliminated from FIFA World Cup
ఫిఫా ప్రపంచ కప్ నకు ఆతిథ్యం ఇస్తున్న ఖతార్ ఆటలో తీవ్రంగా నిరాశ పరిచింది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓడిన ఆతిథ్య ఖతార్‌ టోర్నీ గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టింది. శుక్రవారం రాత్రి జరిగిన గ్రూప్‌–ఎ మ్యాచ్‌లో సెనెగల్‌ 3–1తో ఖతార్‌ను చిత్తు చేసింది. ఆ జట్టు స్ట్రయికర్‌ బౌలయె దియా 41వ నిమిషంలో సెనెగల్‌కు తొలి గోల్‌ అందించారు.  ఫమారా 48వ నిమిషంలో చేసిన గోల్ తో సెనెగల్ ఆధిక్యం 2–0కి పెరిగింది. దాంతో, ఖతార్ తీవ్ర ఒత్తిడిలో పడిపోయింది. అయితే, 78వ నిమిషంలో మొహమ్మద్‌ ముంటారి గోల్‌ చేయడంతో ఖతార్ 1–2తో రేసులోకి వచ్చేలా కనిపించింది. మరో గోల్ చేస్తే ఖతార్ డ్రాతో గట్టెక్కేలా కనిపించింది. 

కానీ, ఆరు నిమిషాల తర్వాత బంబా డియెంగ్‌ సెనెగల్‌కు మూడో గోల్‌ అందించడం ఆతిథ్య జట్టు ఆశలపై నీళ్లు కుమ్మరించినట్టయింది. ఇప్పటికే తొలి మ్యాచ్ లో ఖతార్ 0–2తో ఈక్వెడార్ చేతిలో ఓడిపోయింది. దాంతో, రెండు మ్యాచ్ ల్లో ఆ జట్టు ఒక్క పాయింట్ కూడా సాధించలేకపోయింది. మరో వైపు ఈక్వెడార్, నెదర్లాండ్స్ మధ్య జరిగిన మ్యాచ్ 1–1తో డ్రా అయింది. దాంతో, ఖతార్ గ్రూప్ దశలోనే నిష్ర్కమించింది. గ్రూప్ దశలో ఖతార్ తన చివరి మ్యాచ్ లో ఈక్వెడార్ తో పోటీ పడుతుంది. ఇందులో గెలిచినా ఆ జట్టు ప్రిక్వార్టర్ ఫైనల్ కు చేరుకోలేదు. ఈ టోర్నీలో ఇప్పటిదాకా అధికారికంగా నాకౌట్ దశ నుంచి వైదొలిగిన తొలి జట్టు ఖతార్ అయింది. దాంతో, ఓ ఫిఫా ప్రపంచ కప్ లో  ఇంత త్వరగా టోర్నీ నుంచి వైదొలిగిన ఆతిథ్య జట్టుగా ఖతార్ చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది.