ఫిఫా వరల్డ్ కప్.. సౌదీ ఆటగాళ్లకు కానుకగా తలా ఓ రోల్స్ రాయిస్ కారు

26-11-2022 Sat 10:29 | Entertainment
  • ఖతార్ నుంచి తిరిగి రాగానే అందించనున్న సౌదీ ప్రిన్స్
  • అర్జెంటీనాపై గెలిచినందుకు రాచకుటుంబం బహుమతి
  • ఒక్కో కారు విలువ మన రూపాయల్లో సుమారు 11 కోట్లు
Saudi Arabia Football Players To Get Rolls Royce For Beating Argentina In FIFA World Cup
ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ సంచలనాలతో ప్రారంభమైంది.. రెండుసార్లు ఫిఫా ఛాంపియన్ గా నిలిచిన అర్జెంటీనా జట్టును సౌదీ టీమ్ ఓడించి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో సౌదీ అభిమానుల ఆనందానికి హద్దులేకుండా పోయింది. సౌదీ ఫుట్ బాల్ జట్టుపై సామాన్యుడి నుంచి యువరాజు దాకా పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా, అర్జెంటీనాపై సంచలన విజయం నమోదు చేసిన తమ జట్టు ఆటగాళ్లకు సౌదీ యువరాజు ఖరీదైన బహుమతులు అందజేయనున్నట్లు ప్రకటించారు. జట్టు సభ్యులు ఒక్కొక్కరికీ సుమారు రూ.11 కోట్లు ఖరీదు చేసే రోల్స్ రాయిస్ కారును అందజేయనున్నారు.

ఖతార్ నుంచి సౌదీకి తిరిగి రాగానే ఆటగాళ్లు అందరికీ తలా ఓ రోల్స్ రాయిస్ పాంథోమ్ కారును గిఫ్ట్ గా ఇవ్వాలని సౌదీ రాజకుటుంబం నిర్ణయించినట్లు యూకేలోని ఎక్స్ ప్రెస్ ఓ కథనం వెలువరించింది. కాగా, వరల్డ్ ర్యాంకింగ్స్ లో అర్జెంటీనా, సౌదీ అరేబియా జట్ల మధ్య 48 ర్యాంకుల తేడా ఉంది. పైగా, ఫుట్ బాల్ లెజెండ్ లియోనల్ మెస్సీ సారథ్యంలో పటిష్ఠంగా ఉన్న అర్జెంటీనా జట్టును సౌదీ జట్టు ఓడిస్తుందని ఎవరూ ఊహించలేదు. దాదాపు మూడేళ్లుగా అర్జెంటీనా జట్టుకు ఓటమనేదే తెలియదు.. 2022 ఫిఫా వరల్డ్ కప్ బరిలో ఉన్న ఫేవరేట్ జట్లలో అర్జెంటీనా టాప్ లో ఉంది. ఈ నేపథ్యంలోనే సౌదీ విజయం సంచలనంగా మారింది.