Arvind Kejriwal: సుఖేశ్‌ను బీజేపీ జాతీయ అధ్యక్షుడిని చేసుకోవాలి: అరవింద్ కేజ్రీవాల్ వ్యంగ్యం

BJP should make conman Sukesh its national president
  • బీజేపీ పాటలకు సుఖేశ్ డ్యాన్స్ చేస్తుంటారన్న కేజ్రీవాల్
  • ఆయనను స్టార్ క్యాంపెయినర్‌గా చేసి గుజరాత్ ఎన్నికల ప్రచారానికి పంపాలని సూచన
  • బీజేపీ వద్ద సమాధానాలు లేకనే సుఖేశ్ రాసిన ‘ప్రేమలేఖ’లతో పడిపోతోందని ఎద్దేవా
ఆర్థిక నేరగాడు సుఖేశ్ చంద్రశేఖర్‌ను తమ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చేసుకోవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బీజేపీకి సూచించారు. ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో నిర్వహించిన ‘పంచాయత్ ఆజ్‌తక్’ కార్యక్రమానికి కేజ్రీవాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా.. కేజ్రీవాల్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు సుఖేశ్ చంద్రశేఖర్ రాసిన సంచలన లేఖలపై అడిగిన ప్రశ్నకు ఆయనిలా బదులిచ్చారు. సుఖేశ్ బీజేపీ ఆదేశాలతో పనిచేస్తుంటారని అన్నారు. 

ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్‌లో బీజేపీ 15 ఏళ్లుగా అధికారంలో ఉందని, గుజరాత్‌ను 27 ఏళ్లుగా పాలిస్తోందని, ఇన్ని సంవత్సరాల్లో ప్రజలకు వారు చేసిందేంటో వెళ్లి అడగాలని కేజ్రీవాల్ సూచించారు. దీనికి బీజేపీ వద్ద ఎలాంటి సమాధానమూ ఉండదని, అందుకనే సుఖేశ్ రాసిన ప్రేమ లేఖలతో వచ్చేస్తుంటారని దుయ్యబట్టారు.
 
బీజేపీ ఎలా ఆడిస్తే సుఖేశ్ అలా ఆడుతున్నారన్న కేజ్రీవాల్.. సుఖేశ్‌ను స్టార్ క్యాంపెయినర్‌గా చేసి గుజరాత్ ఎన్నికల ప్రచారానికి పంపాలని బీజేపీకి సూచించారు. బీజేపీ పాటలకు సుఖేశ్ ఎలా డ్యాన్స్ చేస్తున్నారో చూస్తున్నామని, బీజేపీ ఆయనను తమ జాతీయ అధ్యక్షుడిగా చేసుకోవాలని వ్యంగ్యంగా అన్నారు. 

దేశంలోని నేరస్థులు, దుండగులు అందరూ రక్షణ కోసం ఒకే పార్టీ పంచన చేరుతున్నారని బీజేపీని ఉద్దేశించి అన్నారు. ఇప్పుడు సుఖేశ్ కూడా అదే చేస్తున్నారని, బీజేపీ నుంచి రక్షణ పొందేందుకు ఆ పార్టీ తరపున డ్యాన్స్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
Arvind Kejriwal
Sukesh Chandrashekhar
BJP
AAP

More Telugu News