ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలనే పనికిమాలిన ఆలోచనలు నాకు ఎందుకు వస్తాయి?: రఘురామకృష్ణరాజు

26-11-2022 Sat 09:09 | Both States
  • కేసీఆర్ ప్రభుత్వానికి హాని తలపెట్టాలనే ఆలోచన తనకు లేదన్న రఘురాజు
  • కొందరు అధికారులు తెలంగాణలో పని చేస్తూ జగన్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్య
  • ఆ అధికారులు ఎవరో కేసీఆర్ గుర్తించాలని సూచన
I never dreamed of harming KCR says Raghu Rama Krishna Raju
హైదరాబాద్ నగరాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతున్నారని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కొనియాడారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇక్కడకు వలస వస్తున్నారని చెప్పారు. ఈ విషయాన్ని గతంలోనే తాను అనేక సార్లు చెప్పానని గుర్తు చేశారు. 

తెలంగాణను ఎంతో అభివృద్ధి చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి హాని తలపెట్టాలనే ఆలోచన తనకు లేదని అన్నారు. తాను ఏనాడూ కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేదని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు కీడు తలపెట్టాలనే ఆలోచన కలలో కూడా చేయలేదని అన్నారు. అలాంటప్పుడు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలనే పనికిమాలిన ఆలోచనలు తనకు ఎందుకు వస్తాయని ప్రశ్నించారు. 

తెలంగాణలో పనిచేస్తూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులు ఎవరో గుర్తించాలని కేసీఆర్ కు, తెలంగాణ ప్రభుత్వానికి రఘురాజు సూచించారు. జగన్ తన మాట వినే కొందరు అధికారులతో ఇలాంటి పనులు చేయిస్తున్నారని ఆరోపించారు. జగన్ తో తనకు గొడవ ఉందని... కేసీఆర్ తో తనకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. తెలంగాణ సిట్ తనకు సీఆర్పీసీ 41 కింద నోటీసులు ఇచ్చిందని... తాను వాటికి సమాధానం ఇస్తానని తెలిపారు.