RJD: కిడ్నీ మార్పిడి చికిత్స కోసం సింగపూర్‌కు లాలూప్రసాద్.. కిడ్నీ దానం చేస్తున్న కుమార్తె!

  • డిసెంబరు 5న కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్
  • కిడ్నీ ఇస్తున్న కుమార్తె రోహిణి ఆచార్య
  • శస్త్ర చికిత్స విజయవంతమవుతుందని తేజస్వి యాదవ్ ఆశాభావం
  • లాలు వెంట తేజస్వి, ఇతర కుటుంబ సభ్యులు
RJD supremo Lalu Yadav off to Singapore for kidney transplant

గత కొంతకాలంగా మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్న ఆర్జేడీ సుప్రీం లీడర్ లాలూ ప్రసాద్ యాదవ్ కిడ్నీ మార్పిడి చికిత్స కోసం సింగపూర్ వెళ్లారు. కుమారుడు తేజస్వి యాదవ్, ఇతర కుటుంబ సభ్యులు ఆయన వెంట ఉన్నారు. 74 ఏళ్ల లాలూ సింగపూర్‌లో కిడ్నీకి చికిత్స తీసుకుంటున్నారు. గత నెలలోనే ఆయన అక్కడి నుంచి తిరిగొచ్చారు. ప్రాథమికంగా పరీక్షలు చేసిన అనంతరం డిసెంబరు మొదటి వారంలో ఆయనకు కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స జరగనుంది. ఈ సందర్భంగా తేజస్వి యాదవ్ మాట్లాడుతూ.. శస్త్రచికిత్స విజయవంతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని శ్రేయోభిలాషులు ప్రార్థించారన్నారు. 

మరోపక్క, పార్టీలో సీనియర్ నేతలకు తగిన గౌరవం లభించడం లేదన్న బీజేపీ ఆరోపణలపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ‘అద్వానీ లానా?’ అని చమత్కరించారు. 

దాణా కుంభకోణం కేసులో అరెస్టయి జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్ ప్రస్తుతం బెయిలుపై ఉన్నారు. జైలులో ఉన్నప్పుడే పలుమార్లు అనారోగ్యంతో ఢిల్లీ, రాంచీ ఆసుపత్రులలో చేరి చికిత్స పొందారు. డయాబెటిస్, బీపీ, కిడ్నీ సహా పలు సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. 

సింగపూర్‌లో ఉంటున్న లాలూ కుమార్తె రోహిణి ఆచార్య తండ్రికి తన కిడ్నీ ఇస్తున్నారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా ఇటీవల వెల్లడించారు. తండ్రి కోసం తాను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు. కాగా, తండ్రి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ కోసం సింగపూర్ వెళ్లేందుకు లాలూ కుమార్తె మీసా భారతికి ఢిల్లీ కోర్టు అనుమతినిచ్చింది. కోర్టుకు ఆమె సమర్పించిన దరఖాస్తు ప్రకారం డిసెంబరు 5న లాలూకు శస్త్రచికిత్స జరగనుంది.

More Telugu News