మహిళల వస్త్రధారణపై రాందేవ్ బాబా వ్యాఖ్యలు.. సర్వత్ర విమర్శలు!

26-11-2022 Sat 08:29 | National
  • ముంబైలో యోగా సైన్స్ శిబిరం నిర్వహణ
  • ఆ వెంటనే ప్రత్యేక సమావేశం
  • సమయాభావం వల్ల దుస్తులు మార్చుకోలేకపోయిన మహిళలు
  • నోరు జారిన యోగా గురు
Women look good even if they dont wear anything SLIP OF TONGUE of Baba Ramdev
యోగా గురువు రాందేవ్ బాబా తాజాగా మహిళలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. మహారాష్ట్రలోని థానేలో నిన్న పతంజలి యోగా పీఠం, ముంబై మహిళల పతంజలి యోగా సమితి సంయుక్తంగా యోగా సైన్స్ శిబిరాన్ని నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్ సహా పలువురు మహిళలు హాజరయ్యారు. యోగా శిక్షణ కార్యక్రమం ముగిసిన వెంటనే ఓ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. 

సమయాభావం వల్ల యోగా దుస్తుల్లో వచ్చిన మహిళలకు వాటిని మార్చుకునే సమయం లభించలేదు. దీనిపై స్పందించిన రాందేవ్ బాబా.. ఇంటికెళ్లాక దుస్తులు మార్చుకోవచ్చని అంటూనే.. మహిళలు చీరలు, సల్వార్ సూట్‌లలో అందంగా ఉంటారని అన్నారు. అక్కడితో ఆగక.. తన కళ్లకైతే వారు అసలేం ధరించకపోయినా బాగుంటారని వ్యాఖ్యానించి వివాదం రాజేశారు. అమృతా ఫడ్నవీస్, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కుమారుడు, ఎంపీ శ్రీకాంత్ షిండే ఎదుటే ఆయనీ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రాందేవ్ బాబా వ్యాఖ్యలపై సర్వత్ర విమర్శలు, ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.