పనిమనిషితో శృంగారం చేస్తూ బెడ్‌పైనే మరణించిన వ్యాపారి.. ప్లాస్టిక్ సంచిలో చుట్టేసి పారేసిన వైనం!

26-11-2022 Sat 09:34 | National
  • కర్ణాటక రాజధాని బెంగళూరులో ఘటన
  • 35 ఏళ్ల పనిమనిషితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న 67 ఏళ్ల వ్యాపారి
  • హత్యకేసు చుట్టుకుంటుందని భయపడిన మహిళ
  • భర్త, సోదరుడి సాయంతో మృతదేహాన్ని తీసుకెళ్లి నిర్జన ప్రదేశంలో పడేసిన వైనం
Bengaluru Man Dies During Sex With Help Husband Helps Her Dump Body
తన ఇంట్లో పనిచేసే 35 ఏళ్ల పనిమనిషితో వివాహేతర సంబంధం పెట్టుకున్న 67 ఏళ్ల వ్యాపారి.. ఆమెతో శృంగారం చేస్తూ గుండెపోటుకు గురై బెడ్‌పైనే మృతి చెందాడు. దీంతో హడలిపోయిన మహిళ అది తన పీకకు ఎక్కడ చుట్టుకుంటుందో అని భావించి భర్త, సోదరుడిని పిలిపించింది. అందరూ కలిసి ఓ పెద్ద ప్లాస్టిక్ కవర్‌లో మృతదేహాన్ని చుట్టేసి ఎవరికీ అనుమానం రాకుండా బయటకు తీసుకెళ్లి నిర్జన ప్రదేశంలో పడేశారు. బెంగళూరులోని జేపీ నగర్ పుట్టెనహళ్లి ప్రాంతంలో జరిగిందీ ఘటన.

మృతదేహానికి సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు దానిని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. అయితే, శరీరంపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో అది హత్య కాదన్న నిర్ధారణకొచ్చారు. బాధితుడిని వ్యాపారి బాలసుబ్రహ్మణ్యంగా గుర్తించి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో పనిమనిషిని కూడా విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 16న బాలసుబ్రహ్మణ్యం పనిమనిషి ఇంటికి వెళ్లాడు. ఆమెతో శృంగారం చేస్తుండగా గుండెపోటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో పనిమనిషి భయపడిపోయింది. తనపై హత్యకేసు నమోదవుతుందన్న భయంతో భర్త, సోదరుడికి ఫోన్ చేసి పిలిపించింది. అనంతరం ముగ్గురు కలిసి సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచిలో చుట్టేసి బయటకు తీసుకెళ్లి ఎవరూ లేని చోట పడేశారు. పనిమనిషితో ఆయనకు చాలాకాలంగా వివాహేతర సంబంధం ఉన్నట్టు, ఈ విషయం సదరు మహిళ భర్తకు కూడా తెలుసనీ ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు. అలాగే సదరు వ్యాపారి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడని, గతేడాది యాంజియో ప్లాస్టీ కూడా చేయించుకున్నాడనీ చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.