Gudivada Amarnath: కొండలపై గతంలో ఏ నిర్మాణాలు జరగలేదా?: సీపీఐ నారాయణకు మంత్రి అమర్నాథ్ కౌంటర్

Minister Amarnath counters CPI Narayana remarks on Rishikonda
  • రుషికొండను సందర్శించిన సీపీఐ నారాయణ
  • రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు  
  • విపక్షాలు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నాయో అర్థంకావడంలేదన్న మంత్రి 
  • నారాయణ అంతకంటే గొప్పగా మాట్లాడతారని అనుకోలేదని వ్యాఖ్య 
విశాఖలోని రుషికొండ వద్ద నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం సీపీఐ అగ్రనేత నారాయణ ఏపీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించగా, మంత్రి గుడివాడ అమర్నాథ్ వెంటనే స్పందించారు. విశాఖలో ఎలాంటి నిర్మాణాలు జరిగినా, వాటిని అడ్డుకోవడమే విపక్షాలు పనిగా పెట్టుకున్నాయని మండిపడ్డారు. 

గతంలో కొండల్లో అనేక పర్యాటక ప్రాజెక్టులు రూపుదిద్దుకున్నాయని, రుషికొండలోనూ అలాంటి ప్రాజెక్టే చేపడుతుంటే విపక్షాలు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నాయో అర్థంకావడంలేదని అన్నారు. విపక్షాలు ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని అమర్నాథ్ పేర్కొన్నారు. 

"ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాగా ఉన్న సీపీఐ చాన్నాళ్ల కిందటే చంద్రబాబు పార్టీ ఆఫ్ ఇండియాగా మారిపోయింది. ఇప్పుడా పార్టీ నాయకులు రుషికొండ వద్దకు వెళ్లి అంతకంటే గొప్పగా మాట్లాడతారని మేం అనుకోవడంలేదు. వాళ్లు చేస్తున్నది రాజకీయం మాత్రమే. రుషికొండ తరహాలోనే అనేక కొండలపై గత ప్రభుత్వాల హయాంలో నిర్మాణాలు జరిగాయి. రామానాయుడు స్టూడియో ఓ కొండ మీదే నిర్మాణం జరిగింది. అనేక ఐటీ సెజ్ లు కొండ మీద ఏర్పడ్డాయి. ఇప్పుడు రుషికొండలో ఓ రిసార్టు, టూరిజం ప్రాజెక్టు ఏర్పాటు చేస్తుంటే ప్రతిపక్ష నేతలు ఎందుకు కడుపుమంటతో ఏడుస్తారు?" అంటూ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Gudivada Amarnath
CPI Narayana
Rishikonda
YSRCP
CPI
Andhra Pradesh

More Telugu News