Marri Shashidhar Reddy: బీజేపీలో చేరిన మర్రి శశిధర్ రెడ్డి

Telangana politician Marri Shashidhar Reddy joins BJP
  • ఇటీవల కాంగ్రెస్ ను వీడిన శశిధర్ రెడ్డి
  • నేడు కేంద్రమంత్రుల సమక్షంలో బీజేపీలో చేరిక
  • పార్టీ కండువా కప్పిన సోనోవాల్, బండి సంజయ్
  • తెలంగాణలో కాంగ్రెస్ పనైపోయిందన్న శశిధర్ రెడ్డి
  • శశిధర్ రెడ్డి నిజాయతీ ఉన్న నేత అన్న కిషన్ రెడ్డి
ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తెలంగాణ సీనియర్ రాజకీయనేత మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరారు. నేడు జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 

కేంద్రమంత్రులు శర్బానంద సోనోవాల్, కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఈ కార్యక్రమంలో మర్రి శశిధర్ రెడ్డికి కాషాయ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానం పలికారు. ఆయనకు పార్టీ సభ్యత్వాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, డీకే అరుణ, ఈటల రాజేందర్ కూడా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ, బీజేపీలోకి రావడం సంతోషం కలిగిస్తోందని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పనైపోయిందని తెలిపారు. టీఆర్ఎస్ ను ఎదుర్కోవడం కాంగ్రెస్ వల్ల కాదని స్పష్టం చేశారు. బీజేపీలో చిత్తశుద్ధి ఉన్న కార్యకర్తగా కృషి చేస్తానని శశిధర్ రెడ్డి పేర్కొన్నారు. 

కిషన్ రెడ్డి మాట్లాడుతూ, మర్రి శశిధర్ రెడ్డి మచ్చలేని నాయకుడు అని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీలో ఇప్పటిదాకా కీలకంగా వ్యవహరించారని తెలిపారు. ఎక్కడ ఎవరు తప్పు చేసినా ధైర్యంగా మాట్లాడగల సత్తా ఉన్నటువంటి వ్యక్తి మర్రి శశిధర్ రెడ్డి అని వివరించారు. కుటుంబ నేపథ్యం కానీ, రాజకీయ నేపథ్యం కానీ, తెలంగాణలో అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన వ్యక్తి అని తెలిపారు. మర్రి శశిధర్ రెడ్డి వంటి వ్యక్తి పార్టీలో చేరడం బీజేపీకి తప్పకుండా ధైర్యాన్ని, బలాన్ని చేకూర్చుతాయని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. 

తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అయితే ఆ మార్పు బీజేపీ ద్వారానే వస్తుందన్న నమ్మకం ప్రజల్లో వుందని తెలిపారు. కల్వకుంట్ల కుటుంబ అవినీతి పాలన పోవాలంటే అది బీజేపీకే సాధ్యమని ప్రజలు భావిస్తున్నారని వెల్లడించారు. టీఆర్ఎస్ సర్కారు బరితెగించిందని, తెలంగాణలో కుటుంబ పాలనే ఉండాలన్న అహంకార పూరితంగా వ్యవహరిస్తోందని కిషన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, టీఆర్ఎస్ కు గట్టి బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు.
Marri Shashidhar Reddy
BJP
Telangana
Congress

More Telugu News