Pradeep Ranganathan: మూవీ రివ్యూ 'లవ్ టుడే'

  • ఈ రోజునే విడుదలైన 'లవ్ టుడే'
  • హీరోగా, దర్శకుడిగా మెప్పించిన ప్రదీప్ రంగనాథన్ 
  • గ్లామర్ తో కట్టిపడేసిన ఇవాన
  • ఆమె ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణ 
  • యూత్ కి కనెక్ట్ అయ్యే కంటెంట్ తో వచ్చిన సినిమా ఇది  
Love Today Movie Review

ఈ మధ్య కాలంలో స్మార్ట్ ఫోన్ ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఒక క్షణం కూడా స్మార్ట్ ఫోన్ కి దూరంగా యూత్ ఉండలేకపోతోంది. ప్రపంచం మొత్తం ఇప్పుడు స్మార్టు ఫోన్ లో ఇమిడిపోయింది. అరచేతిలో స్వర్గం మాదిరిగా కుర్రకారు చేతిలో ఇప్పుడు స్మార్ట్ ఫోన్ కనిపిస్తోంది. స్మార్ట్ ఫోన్ అనేది ఆ వ్యక్తికి సంబంధించిన సీక్రెట్ లాకర్ మాదిరిగా మారిపోయింది. అలాంటి స్మార్టు ఫోన్స్ జీవితాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయనే అంశంతో రూపొందిన సినిమానే 'లవ్ టుడే. 

తమిళనాట ఈ సినిమా ఈ నెల 4వ తేదీనే విడుదలై అక్కడ భారీ హిట్ కొట్టింది. తమిళంలో ఏజిఎస్ ఎంటర్టయిన్మెంట్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాను, తెలుగులో దిల్ రాజు ఈ రోజున విడుదల చేశారు. ఈ సినిమాలో హీరోగా చేసిన ప్రదీప్ రంగనాథన్, రచయితగా .. దర్శకుడిగా కూడా వ్యవహరించడం విశేషం. ఆయన జోడీగా 'ఇవాన' నటించింది. తమిళంలో వసూళ్ల వర్షం కురిపిస్తున్న ఈ కథ ఇక్కడి కుర్రాళ్లకు ఎంతవరకూ కనెక్ట్ అయిందనేది చూద్దాం. 

ప్రదీప్ (ప్రదీప్ రంగనాథన్) ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు. అతని తల్లి (రాధిక శరత్ కుమార్) పద్ధతి గల మనిషి. స్మార్టు ఫోన్ లు పిల్లలను పాడుచేస్తున్నాయనే ఉద్దేశంతో ఎక్కువగా వాడనీయదు. ప్రదీప్ కి దివ్య (రవీనా రవి) అనే ఒక సిస్టర్ ఉంటుంది. ఆమె పెళ్లి యోగి (యోగిబాబు)తో కుదురుతుంది. పెళ్లికి సంబంధించిన సన్నాహాలు జరుగుతూ ఉంటాయి. 

ఈ నేపథ్యంలోనే నిఖిత (ఇవాన) అనే అమ్మాయి ప్రేమలో ప్రదీప్ పడతాడు. తల్లిలేని నిఖితను వేణు శాస్త్రి ( సత్యరాజ్) ఎంతో క్రమశిక్షణతో పెంచుతాడు. నిఖితకు ఆమె చెల్లెలు శ్వేతకు తండ్రి అంటే చాలా భయం. జీవితంలో ప్రతి విషయంలోను అతనికి కొన్ని లెక్కలు ఉంటాయి. ఓ ప్రైవేట్ సంస్థలో జాబ్ చేస్తున్న ప్రదీప్ కి నిఖితతో పరిచయం ఏర్పడుతుంది. అది కాస్తా ప్రేమగా మారుతుంది. అలా ఒక ఏడాదిపాటు వారి ప్రేమ వ్యవహారం కొనసాగిన తరువాత వేణు శాస్త్రికి తెలుస్తుంది. 

తన తండ్రి రమ్మంటున్నాడని నిఖిత కాల్ చేయడంతో, వాళ్ల ఇంటికి ప్రదీప్ వెళతాడు. నిఖితను ప్రేమిస్తున్నట్టుగా చెప్పి, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టుగా చెబుతాడు. అప్పుడు ఉన్నపళంగా నిఖిత స్మార్ట్ ఫోన్ తీసుకుని ప్రదీప్ కీ .. అతని స్మార్ట్ ఫోన్ ను నిఖితకు ఇస్తాడు వేణుశాస్త్రి. ఒక రోజంతా ఒకరి ఫోన్ ఒకరి దగ్గర ఉండాలనీ, ఆ తరువాత కూడా వాళ్ల ప్రేమ అలాగే ఉంటే పెళ్లి చేయడానికి తనకి ఎలాంటి అభ్యంతరం లేదని అతను చెబుతాడు. 

ఒకరి ఫోన్ లాక్ ను ఒకరు ఎలా ఓపెన్ చేయవచ్చునో కూడా వేణుశాస్త్రి చెబుతాడు. ఇద్దరికీ కూడా ఎవరెవరితో కాంటాక్ట్స్ ఉన్నాయి. ఎవరితో చాటింగ్ చేస్తున్నారు .. ఎలాంటి మెసేజ్ లు పెడుతున్నారు .. ఎవరెవరి నుంచి కాల్స్ వస్తున్నాయి వంటి విషయాలు తెలిస్తే, ఆ తరువాత పెళ్లి గురించిన ఆలోచన చేయవచ్చనేది వేణు శాస్త్రి అభిప్రాయం. అతను తీసుకున్న ఆ నిర్ణయం కారణంగా ప్రదీప్ - నిఖిత మధ్య ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయనేదే కథ.

స్మార్టు ఫోన్ల తయారీ పైనే ఈ సినిమా టైటిల్స్ పడతాయి. దానిని బట్టే ఈ కథలో స్మార్టు ఫోన్ పాత్రనే ప్రధానమనే విషయం మనకి అర్థమైపోతుంది. స్మార్టు ఫోన్లకు యూత్ ఎలా అలవాటుపడిపోయారు? తమకి తెలియకుండానే వాళ్లు ఎలాంటి చిక్కుల్లో పడుతున్నారు? ఎలా మనశ్శాంతిని కోల్పోతున్నారు? స్మార్టు ఫోన్ల కారణంగా అమ్మాయిలు .. అబ్బాయిలు  ఎలా అబద్ధాలకు కూడా అలవాటు పడిపోతున్నారు? అనేది ప్రదీప్ రంగనాథన్ బాగా చూపించాడు. 

ఇటు అబ్బాయిలకు .. అటు అమ్మాయిలకు స్మార్టు ఫోన్స్ కారణంగా ఎక్కువమందితో పరిచయాలు ఏర్పడటం .. దాని కారణంగా ప్రేమలో నిజాయతీ లోపించడం .. ప్రమాదం ఇంటివరకూ వచ్చేవరకూ పెద్దవాళ్లకు ఈ విషయాలు తెలియకపోవడం వంటి సన్నివేశాలను తెరపై ఆసక్తికరంగా ఆవిష్కరించాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా కరెక్టుగా పడుతుంది. అయితే అక్కడి నుంచి కథ ఆశించిన స్థాయిలో అందుకోదు. ఫస్టాఫ్ నడిచినంత గ్రిప్పింగ్ తో సెకండాఫ్ నడవలేకపోయింది. 

సన్నివేశాల పరంగా కూడా అంత ఇంపాక్ట్ చూపలేకపోయింది. సెకండాఫ్ లో ఎమోషన్ పాళ్లు ఎక్కువగానే కనిపించినప్పటికీ, సన్నివేశాల్లో కాస్త హడావిడి కనిపిస్తుంది. కాకపోతే క్లైమాక్స్ కి వచ్చేసరికి మళ్లీ కుదురుకుంటుంది. ఫస్టాఫ్ ఆరంభంలో  వచ్చే ఒక్క పాట మినహా చెప్పుకోదగిన పాటలేం లేవు. యువన్ శంకర్ రాజా అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. దినేశ్ పురుషోత్తమన్ కెమెరా పనితనం కూడా ఆకట్టుకుంటుంది. 

ఈ సినిమాలో ఓ పదేళ్లలోపు పిల్లాడు ఒక మామిడి టెంకను మట్టిలో పాతిపెట్టి, మొక్క వస్తుందో లేదో చూడటం కోసం ప్రతిరోజు నేలను త్రవ్వి బయటికి తీస్తుంటాడు. అలా అతను ఎందుకు చేస్తున్నాడనేది చివర్లో రివీల్ చేసిన విధానం బాగుంది. హీరో వైపు నుంచి రాధిక .. హీరోయిన్ వైపు నుంచి సత్యరాజ్ కథను బ్యాలెన్స్ చేశారు. విలన్ లేకపోయినా.. డ్యూయెట్లు లేకపోయినా ఆ లోటు తెలియకుండానే కథ నడుస్తుంది. 

హీరో చాలా నేచురల్ గా చేశాడు. అందంగా కనిపించే ప్రయత్నం కూడా చేయకుండా, సహజత్వానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. హీరోయిన్ ఇవానా ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణ. విశాలమైన కళ్లతో .. ఆకర్షణీయమైన రూపంతో కుర్రాళ్ల మనసులను కొల్లగొడుతుంది. ఈ మధ్య కాలంలో తెరపై మెరిసిన అందమైన కథానాయికల జాబితాలో ఆమె పేరు చేర్చుకోవచ్చు. ఈ సినిమా తరువాత అటు తమిళంలోను .. ఇటు తెలుగులోను ఆమె బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కథలో యూత్ కి కావాల్సిన కంటెంట్ పుష్కలంగా ఉండటంతో, వాళ్లకి తప్పకుండా కనెక్టు అవుతుంది.

More Telugu News