Team India: చెలరేగిన లాథమ్, విలియమ్సన్... తొలి వన్డేలో టీమిండియా ఓటమి

Team India lost first ODI against New Zealand
  • ఆక్లాండ్ లో మ్యాచ్
  • 7 వికెట్ల తేడాతో కివీస్ విక్టరీ
  • తొలుత 50 ఓవర్లలో 7 వికెట్లకు 306 రన్స్ చేసిన భారత్
  • 47.1 ఓవర్లలోనే ఛేదించిన న్యూజిలాండ్
  • లాథమ్ అజేయ సెంచరీ... విలియమ్సన్ 94 నాటౌట్
న్యూజిలాండ్ తో తొలి వన్డేలో టీమిండియా పరాజయంపాలైంది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు ఆక్లాండ్ లో జరిగిన మొదటి మ్యాచ్ లో భారత్ పై కివీస్ జట్టు 7 వికెట్ల తేడాతో గెలిచింది.

ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 306 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ (80), కెప్టెన్ శిఖర్ ధావన్ (72), శుభ్ మాన్ గిల్ (50) అర్ధసెంచరీలతో రాణించగా, వాషింగ్టన్ సుందర్ (37 నాటౌట్), సంజు శాంసన్ (36) ఉపయుక్తమైన ఇన్నింగ్స్ ఆడారు. కివీస్ బౌలర్లలో లాకీ ఫెర్గుసన్ 3, సౌథీ 3, మిల్నే 1 వికెట్ తీశారు. 

అనంతరం 307 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన న్యూజిలాండ్ 47.1 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఉమ్రాన్ మాలిక్ విజృంభించడంతో ఓ దశలో 88 పరుగులకే 3 వికెట్లు చేజార్చుకున్న కివీస్ ను వికెట్ కీపర్ టామ్ లాథమ్, కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఆదుకున్నారు. లాథమ్ 104 బంతుల్లో 145 పరుగులతో అద్భుత సెంచరీ చేసి అజేయంగా నిలిచాడు. అతడి స్కోరులో 19 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. మరో ఎండ్ లో విలియమ్సన్ 98 బంతుల్లో 94 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. 

ఈ జోడీ భారీ షాట్లతో విరుచుకుపడడంతో భారత బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. టీమిండియా బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ 2 వికెట్లు తీయగా, శార్దూల్ ఠాకూర్ 1 వికెట్ పడగొట్టాడు. అర్షదీప్ సింగ్ 8.1 ఓవర్లు వేసి ఒక్క వికెట్టూ తీయలేకపోగా 68 పరుగులు ఇచ్చాడు. ఉమ్రాన్ మాలిక్ 2 వికెట్లు తీసినా 10 ఓవర్లలో 66 పరుగులు సమర్పించుకున్నాడు. సీనియర్ బౌలర్ చహల్ పరిస్థితి కూడా అంతే. చహల్ విసిరిన 10 ఓవర్లలో కివీస్ బ్యాట్స్ మెన్ 67 పరుగులు పిండుకున్నారు. 

ఈ విజయంలో మూడు వన్డేల సిరీస్ లో న్యూజిలాండ్ 1-0తో ముందంజ వేసింది. ఇరుజట్ల మధ్య రెండో వన్డే ఈ నెల 27న హామిల్టన్ లోని సెడాన్ పార్క్ స్టేడియంలో జరగనుంది.
Team India
New Zealand
1st ODI
Tom Latham
Kane Williamson

More Telugu News