తెలంగాణ సిట్ నోటీసులపై రఘురామకృష్ణరాజు స్పందన

25-11-2022 Fri 14:51
  • సంచలనం సృష్టిస్తున్న 'ఎమ్మెల్యేలకు ఎర' వ్యవహారం
  • ఇప్పటికే ముగ్గురు నిందితుల అరెస్ట్
  • ఈ కేసులో ఆసక్తికర మలుపు
  • వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకు నోటీసులు
  • సిట్ నోటీసులు అందాయన్న రఘురామ
MP Raghurama Krishna Raju reacts to SIT notice
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఆసక్తికర మలుపు తిరగడం తెలిసిందే. ఈ కేసును విచారిస్తున్న తెలంగాణ సిట్ అధికారులు వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు నోటీసులు ఇవ్వడం తెలిసిందే. దీనిపై రఘురామకృష్ణరాజు స్పందించారు. 

ఎమ్మెల్యేలకు ఎర కేసులో తనకు సిట్ నోటీసులు పంపిందని తెలిపారు. ఢిల్లీలోని తన నివాసంలో సిట్ అధికారులు నోటీసులు అందజేశారని వెల్లడించారు. ఈ నెల 29న హైదరాబాదు బంజారాహిల్స్ లోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఈ నోటీసుల్లో పేర్కొన్నారని రఘురామ వివరించారు. 

కాగా, సిట్ నోటీసుల నేపథ్యంలో ఈ కేసులో నిందితులకు, రఘురామకు ఏమైనా లింకులు ఉన్నాయా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో కీలక నిందితులైన రామచంద్రభారతి, సింహయాజులు, నందకుమార్ లను అరెస్ట్ చేసి విచారించిన సిట్... వారు చెప్పిన విషయాల ఆధారంగా మరికొంతమందికి నోటీసులు పంపుతోంది. ఆ విధంగానే రఘురామకు కూడా నోటీసులు పంపి ఉంటారని భావిస్తున్నారు.