విజయసాయిరెడ్ది తలుచుకుంటే తప్ప, ఆ ఫోన్ ను ఏ పోలీసు అధికారి కూడా పట్టుకోలేడు: వర్ల రామయ్య

25-11-2022 Fri 14:34
  • విజయసాయిరెడ్డి ఫోన్ మిస్సింగ్
  • రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసిన వ్యవహారం
  • కావాలనే పడేసుకున్నారంటూ టీడీపీ నేతల ఆరోపణలు
  • విజయసాయి ఫోన్ దొరికితే రెండు పెద్ద తలలకు నష్టమన్న వర్ల
Varla Ramaiah responds to Vijayasai Reddy phone missing
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫోన్ కనిపించకుండా పోవడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విజయసాయి పర్సనల్ ఫోన్ పోయిందంటూ ఆయన పీఏ లోకేశ్వరరావు తాడేపల్లి పోలీసులకు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. విజయసాయి లేటెస్ట్ మోడల్ ఐఫోన్ వాడుతున్నట్టు తెలుస్తోంది.

అయితే, ఆయన ఫోన్ పోలేదని, కావాలనే పడేసుకున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటికే విజయసాయి అల్లుడు రోహిత్ రెడ్డి సోదరుడు శరత్ చంద్రారెడ్డిపై విచారణ జరుగుతున్న సమయంలోనే ఫోన్ పోవడం పక్కా ప్రణాళిక ప్రకారమే చేశారని అంటున్నారు. 

ఈ నేపథ్యంలో, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఈ వ్యవహారంపై స్పందించారు. దేశంలోకెల్లా అవినీతిలో ప్రధాన రాజకీయనాయకుడు విజయసాయిరెడ్డి అని పేర్కొన్నారు. 

ఆయన ఫోన్ దొరికితే అధికారంలో ఉన్న రెండు పెద్ద తలలకు తీవ్ర నష్టం జరుగుతుందని, రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుందని పేర్కొన్నారు. అయితే, విజయసాయిరెడ్డి తలుచుకుంటే తప్ప ఆ ఫోన్ ను ఏ పోలీసు అధికారి కూడా పట్టుకోలేడని వర్ల రామయ్య వివరించారు.