దంచికొట్టిన శ్రేయస్ అయ్యర్.. తొలి వన్డేలో భారత్ భారీ స్కోరు

25-11-2022 Fri 11:04
  • 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 306 పరుగులు చేసిన టీమిండియా
  • అర్ధ శతకాలతో రాణించిన ధవన్, శుభ్ మన్ గిల్
  • నిరాశ పరిచిన రిషబ్ పంత్, సూర్యకుమార్ 
India posts good target against Newzeland
మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్ లో భారత్ భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (76 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 80) అద్భుత బ్యాటింగ్ తో భారీ స్కోరు సాధ్యమైంది. తొలుత ఓపెనర్లు శిఖర్ ధవన్ (77 బంతుల్లో 13 ఫోర్లతో 72), శుభ్ మన్ గిల్ (65 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లతో 50) అర్ధ సెంచరీలతో రాణించారు. తొలి వికెట్ కు 124 పరుగుల భాగస్వామ్యంతో మంచి పునాది వేశారు. అయితే, మిడిలార్డర్ లో రిషబ్ పంత్, సూర్యకుమార్ విఫలమయ్యారు. 
 
నాలుగో నంబర్ లో బ్యాటింగ్ కు వచ్చిన పంత్ 23 బంతుల్లో కేవలం 15 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ నాలుగు పరుగులు మాత్రమే చేసి నిరాశ పరిచాడు. అయితే వన్ డౌన్ లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ జట్టును ఆదుకున్నాడు. సంజూ శాంసన్ (36)తో ఐదో వికెట్ కు 94 పరుగులు జోడించాడు. స్పిన్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ (16 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 నాటౌట్) చివర్లో మెరుపులు మెరిపించడంతో భారత స్కోరు 300 మార్కు దాటింది. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ, లోకీ ఫెర్గూసన్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.