కేజ్రీవాల్ ను చంపేందుకు ప్రయత్నిస్తున్నారు: మనీశ్ సిసోడియా

25-11-2022 Fri 10:08
  • కార్పొరేషన్ ఎన్నికల్లో ఓడిపోతామని బీజేపీ భయపడుతోందన్న సిసోడియా
  • మనోజ్ తివారీ నేతృత్వంలో హత్యకు కుట్ర జరుగుతోందని ఆరోపణ
  • ఇప్పటికే పక్కా ప్లాన్ సిద్ధం చేశారని వ్యాఖ్య
BJP conspiring to kill Kejriwal says Manish Sisodia
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను చంపేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ మున్నిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని అన్నారు. ఢిల్లీ బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ నేతృత్వంలో ఈ కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కేజ్రీవాల్ పై దాడి చేయాలని ఇప్పటికే తన గూండాలకు మనోజ్ తివారీ బహిరంగంగా చెప్పారని... ఇప్పటికే పక్కా ప్లాన్ ను సిద్ధం చేశారని అన్నారు. ఇలాంటి కుట్రపూరిత రాజకీయాలకు ఆప్ భయపడదని చెప్పారు. బీజేపీ కుట్రలకు ప్రజలే సమాధానం చెపుతారని అన్నారు. 

కేజ్రీవాల్ గురించి మనోజ్ తివారీ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సిసోడియా ఈ ఆరోపణలు చేశారు. అంతులేకుండా కొనసాగుతున్న అవినీతి, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టికెట్లను అమ్ముకోవడం, రేపిస్టులతో స్నేహం, జైల్లో ఆప్ మంత్రికి మసాజులు వంటి పరిణామాల పట్ల ఆప్ కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారని... కేజ్రీవాల్ భద్రతపై తనకు ఆందోళనగా ఉందని మనోజ్ అన్నారు. ఇప్పటికే ఆప్ ఎమ్మెల్యేలను ప్రజలు చితకబాదిన ఘటనలను కూడా చూశామని... ఇలాంటి అనుభవం ఢిల్లీ ముఖ్యమంత్రికి ఎదురు కాకూడదని కోరుకుంటున్నానని చెప్పారు. ఈ వ్యాఖ్యలకు సిసోడియా కౌంటర్ ఇచ్చారు.