ఎన్టీఆర్ శతజయంతి అవార్డును అందుకోనున్న జయప్రద!

24-11-2022 Thu 22:04
  • ఘనంగా జరుగుతున్న 'ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు'
  • ఇటీవలే ఎన్టీఆర్ శతజయంతి అవార్డును అందుకున్న ఎల్. విజయలక్ష్మి 
  • ఆ తరువాత నటిగా ఎంపికైన జయప్రద 
  • 70 - 80 దశకాలలో ఎన్టీఆర్ తో పలు సినిమాలు చేసిన అందాల తార 
  • ఈ నెల 27వ తేదీన తెనాలిలో అవార్డు ప్రదానం
Ntr centuary award to Jayaprada
ఎన్టీ రామారావు శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఎన్టీఆర్ సినిమా 'జగదేకవీరుని కథ' సినిమాతో పరిచయమై, ఆయనతో కలిసి పలు జానపద .. పౌరాణిక చిత్రాలలో నటించిన ఎల్. విజయలక్ష్మిని ఎన్టీఆర్ శతజయంతి అవార్డుతో సత్కరించి, బంగారు పతకం అందజేశారు. తెనాలిలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆమె అమెరికా నుంచి వచ్చి, హాజరైన సంగతి తెలిసిందే. 

ఇక ఆ తరువాత కాలంలో ఎన్టీ రామారావుతో కలిసి పలు సూపర్ హిట్ చిత్రాలలో నటించిన జయప్రదను కూడా ఈ అవార్డు కోసం ఎంపిక చేశారు. 1970 - 80 దశకాలలో ఆమె ఎన్టీఆర్ తో కలిసి చేసిన సినిమాలలో అడవి రాముడు .. యమగోల .. యుగపురుషుడు .. సూపర్ మేన్ వంటి హిట్ చిత్రాలు కనిపిస్తాయి. అప్పట్లో అందాల తార అంటే జయప్రద పేరునే చెప్పుకునేవారు. 

శ్రీదేవి తరువాత దక్షిణాది నుంచి వెళ్లి నార్త్ లోను తన జోరు చూపించిన హీరోయిన్ ఆమె. ఇక రాజకీయాలలోను ఆమె తనదైన మార్కును చూపించారు. నటిగా ఉన్నత శిఖరాలను అధిరోహించిన జయప్రదకు, ఈ నెల 27వ తేదీన తెనాలిలోని ఎన్వీ ఆర్ కన్వెన్షన్ లో ఎన్టీఆర్ అవార్డును .. బంగారు పతకం అందజేయనున్నారు. లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ ఈ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.