ఏ అవసరం వచ్చినా నేనున్నా: నారా లోకేశ్

24-11-2022 Thu 21:51
  • మంగళగిరి నియోజకవర్గంలో లోకేశ్ పర్యటన
  • నూతక్కి గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమం
  • ఏ అవసరం వచ్చినా ఆదుకుంటానని గ్రామస్తులకు హామీ
Lokesh fires in Mangalagiri MLA Alla Ramakrishna Reddy
మంగళగిరి నియోజకవర్గంలో పేదలకు ఒక్క ఇల్లూ కట్టలేని ఎమ్మెల్యే ఆళ్ల రామక్రష్ణారెడ్డి వేలాది ఇళ్లు కూల్చేస్తున్నాడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. నూతక్కి గ్రామంలో గురువారం నిర్వహించిన 'బాదుడే బాదుడు' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామంలో సమస్యలు పరిశీలించారు. ఇంటింటికీ వెళ్లి వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. ఏ అవసరం ఉన్నా ఆదుకుంటానని గ్రామస్తులకు లోకేశ్ భరోసా ఇచ్చారు. 

సైకో మాదిరిగా మారిన ముఖ్యమంత్రి ధరలు, చార్జీలు, పన్నులు పెంచేశాడని విమర్శించారు. గ్రామస్తులు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గ ప్రగతి కోసం వేల కోట్లు కేటాయించామంటోన్న వైసీపీ ప్రభుత్వం, ఎమ్మెల్యే... అవి ఎక్కడ ఖర్చు చేశారో వెల్లడించాలని డిమాండ్ చేశారు.  

ప్రగతి పనుల కోసం ఒక్క రూపాయి నిధులు సాధించలేని చిన్న సైకో ఎమ్మెల్యే ఆర్కే, పన్నుల పేరుతో ప్రజల్ని బాదాలని అధికారులకు టార్గెట్లు విధించడం దారుణమన్నారు. చివరికి ఖాళీ స్థలాలను కూడా వదలకుండా పన్నులు వసూలు చేయాలని అధికారికంగా ఆదేశించడం ఎమ్మెల్యే దోపిడీ బుద్ధికి నిదర్శనమన్నారు. పేదలకు ఒక్క ఇల్లూ కట్టి ఇవ్వలేని చిన్న సైకో నూతక్కి గ్రామంలో ఇళ్లు తొలగించేందుకు ప్రయత్నాలు చెయ్యడం దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. 

బాధితులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉండి పోరాడుతుందని హామీ ఇచ్చారు. పన్నుల బాదుడు, ప్రజల బాధలు పోవాలంటే... సైకో ప్రభుత్వం పోయి సైకిల్ సర్కారు రావాలని నారా లోకేశ్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.