పవన్ కల్యాణ్ కు ఇంతకంటే పెద్ద దెబ్బ మరొకటి ఉండదు: మంత్రి రోజా

24-11-2022 Thu 20:00
  • పవన్ ను చంద్రబాబు వాడుకుంటున్నారన్న రోజా  
  • పవన్ కు సమస్యలపై అవగాహన లేదని వ్యాఖ్య 
  • చంద్రబాబు, పవన్ చేస్తున్నవి దిగజారుడు రాజకీయాలని విమర్శ  
Roja comments on Pawan Kalyan
ఏపీ టూరిజం, క్రీడలు, సాంస్కృతిక వ్యవహారాల మంత్రి రోజా రాజకీయ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ సీఎం జగన్ పై విషం చిమ్మి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు, పవన్ చేస్తున్నవి దిగజారుడు రాజకీయాలని పేర్కొన్నారు. 

పవన్ కల్యాణ్ ను చంద్రబాబు పావుగా వాడుకుంటున్నారని రోజా వెల్లడించారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని వాడుకుని వదిలేసిన ఘనత చంద్రబాబుదని, పవన్ కల్యాణ్ ను కూడా అలాగే వాడుకుని వదిలేస్తాడని రోజా విమర్శించారు. రాష్ట్ర సమస్యలపై ఏమాత్రం అవగాహన లేని పవన్ చంద్రబాబు ఉచ్చులో చిక్కుకోకుండా వాస్తవాలను గ్రహించాలని హితవు పలికారు. 

ఇప్పటికే విశాఖ ఎయిర్ పోర్టులో ఘటనలో పవన్ కల్యాణ్ ను వాడుకున్న చంద్రబాబు... ఇప్పటంలో తెలివిగా పవన్ ను ఇరికించాడని రోజా ఆరోపించారు. ఇప్పటం ఉన్నది మంగళగిరి నియోజకవర్గంలో కాగా, ఇక్కడ పోటీ చేసేది చంద్రబాబు కొడుకు లోకేశ్ అని, కానీ ఇప్పటం గ్రామానికి పవన్ వెళ్లి ఇరుక్కుపోయాడని వివరించారు. 

ఇప్పటం వ్యవహారంలో హైకోర్టుకే తప్పుడు సమాచారం అందించారని, దాని ఫలితంగానే 14 మందికి కోర్టు రూ.1 లక్ష చొప్పున జరిమానా వడ్డించిందని అన్నారు. పవన్ కల్యాణ్ కు ఇంతకంటే పెద్ద దెబ్బ ఇంకేముంటుంది? అని రోజా ఎత్తిపొడిచారు.