Chandrababu: వైసీపీలో ప్రకంపనలు మొదలయ్యాయి... అందుకే వాళ్లను మార్చేశారు: చంద్రబాబు

Chandrababu slams YCP
  • పార్టీ ఆఫీసులో ఆక్వా రైతులతో చంద్రబాబు భేటీ
  • కర్నూలులో తన పర్యటనకు విశేష స్పందన వచ్చిందని వెల్లడి
  • అందుకే వైసీపీలో జిల్లా అధ్యక్షులను మార్చుతున్నారని వివరణ
రాష్ట్రంలో పలు జిల్లాలకు పార్టీ అధ్యక్షులను మార్చుతూ సీఎం జగన్ నిర్ణయించడం తెలిసిందే. సుచరిత (గుంటూరు జిల్లా), ముత్తంశెట్టి శ్రీనివాస్ (విశాఖ), పుష్ప శ్రీవాణి (పార్వతీపురం మన్యం జిల్లా), బుర్రా మధుసూదన్ యాదవ్ (ప్రకాశం జిల్లా), చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (తిరుపతి జిల్లా), బాల నాగిరెడ్డి (కర్నూలు జిల్లా) తదితరులను జిల్లా వైసీపీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించారు. 

దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఇటీవల కర్నూలులో తాను నిర్వహించిన పర్యటనకు యువత, ప్రజల నుంచి విశేషరీతిలో స్పందన వచ్చిందని తెలిపారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంత భారీ స్పందన ఎప్పుడూ చూడలేదని అన్నారు. దాంతో, వైసీపీలో ప్రకంపనలు మొదలయ్యాయని, అందుకే రాష్ట్రంలో 8 జిల్లాలకు పార్టీ అధ్యక్షులను మార్చేశారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లోనూ వైసీపీ ఓడిపోవడం ఖాయమని చంద్రబాబు పేర్కొన్నారు. 

మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఆక్వా రైతులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఆక్వా రంగానికి పునర్ వైభవం తెచ్చే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. ఎలాంటి పరిమితుల్లేని రీతిలో ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ రూ.1.50కే ఇస్తామని తెలిపారు. జోన్, నాన్ జోన్ విధానాలను ఎత్తివేసి ఆక్వా రంగాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ మేనిఫెస్టోలో ఆక్వా రంగం అంశాలకు కూడా చోటిస్తామని చెప్పారు.
Chandrababu
District Presidents
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News