సినిమా రిలీజయ్యాక ఫస్టు కాల్ నాకు బ్రహ్మానందం గారి దగ్గర నుంచి వచ్చింది: సుడిగాలి సుధీర్

24-11-2022 Thu 14:53
  • ఇటీవలే థియేటర్లకు వచ్చిన 'గాలోడు'
  • సక్సెస్ పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసిన సుధీర్ 
  • ఇదంతా ఫ్యాన్స్ చూపించే ప్రేమ అంటూ వ్యాఖ్య
  • డైరెక్టర్ పనిలో జోక్యం చేసుకోనని వెల్లడి  
Sudigali Sudheer Interview
సుడిగాలి సుధీర్ హీరోగా రూపొందిన 'గాలోడు' సినిమా, ఈ నెల 18వ తేదీన థియేటర్లకు వచ్చింది. రాజశేఖర్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాలో, కథానాయికగా గెహనా సిప్పీ అలరించింది. ఈ సినిమా టీమ్ రీసెంట్ గా సక్సెస్ మీట్ ను కూడా నిర్వహించింది. తాజా ఇంటర్వ్యూలో సుధీర్ ఈ సినిమాను గురించి మాట్లాడాడు. 

"ఈ సినిమా రిలీజ్ అయిన తరువాత ఫస్టు కాల్ నాకు బ్రహ్మానందం గారి దగ్గర నుంచి వచ్చింది. ఈ సినిమా వసూళ్ల పట్ల ఆయన ఆనందాన్ని వ్యక్తం చేశారు. సుధీర్ మనవాడు .. మన ఇంట్లో సభ్యుడు అనే ఒక ఫీలింగుతోనే ఈ సినిమాకి ఆడియన్స్ వచ్చారు. అందువల్లనే ఈ సినిమా ఇంతటి సక్సెస్ ను సాధించింది'' అంటూ చెప్పుకొచ్చాడు. 

"ఈ సినిమా ఇంతటి సక్సెస్ ను సాధిచడానికి కారణం టీమ్ లోని సభ్యుల సమష్టి కృషి. డైరెక్టర్ నన్ను ఎలా చూపించాలో అలా చూపిస్తూ వెళ్లాడు. నేను ఏ విషయంలోను జోక్యం చేసుకోలేదు. డైరెక్టర్ ఎలా చెబితే అలా చేయడమే నాకు తెలుసు. ఏదైనా డౌట్ వస్తే మాత్రం అడుగుతాను అంతే" అంటూ చెప్పుకొచ్చాడు.