Hyderabad: హైదరాబాదులో ఫార్ములా కార్ రేసింగ్ చూసేందుకు టికెట్స్ కొన్న వారికి డబ్బు వాపస్

  • ఈ నెల 19, 20వ తేదీల్లో హుస్సేన్ సాగర్ తీరంలో పోటీలు
  • ప్రాక్టీస్ సమయంలో ప్రమాదాలు జరగడంతో ప్రధాన రేసులు రద్దు
  • రూ. 750 నుంచి రూ. 11 వేల వరకు ఖర్చు చేసి టికెట్లు కొన్న ప్రేక్షకులు
Refund will issued those who bought tickets to watch car racing in Hyderabad

దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరంలో ఏర్పాటు చేసిన స్ట్రీట్ సర్క్యూట్ లో ఈ నెల 19, 20వ తేదీల్లో నిర్వహించిన ఫార్ములా కార్ రేసింగ్ పోటీలు చూసేందుకు టికెట్లు కొన్నవారికి డబ్బులు ఇస్తున్నట్టు ఇండియన్ రేసింగ్ లీగ్ ప్రకటించింది. ఇండియన్ రేసింగ్ లీగ్ తొలి రౌండ్ లో భాగంగా ప్రాక్టీస్ సమయంలో వరుస ప్రమాదాలు జరగడంతో ప్రధాన రౌండ్ పోటీలను నిర్వహించలేదు. శని, ఆదివారాల్లో ఫార్ములా 3 స్థాయి కార్లతో ప్రాక్టస్ మాత్రమే జరిగింది. ఆదివారం జేకే టైర్ నేషనల్ రేసింగ్ చాంపియన్ షిప్ లో భాగంగా ఫార్ములా 4 కార్ల పోటీలు నిర్వహించారు.

 అయితే, ఇండియన్ రేసింగ్ లీగ్ పోటీలను చూసేందుకు ప్రేక్షకులు రూ. 750 నుంచి రూ. 11 వేల ధర వరకు విలువ చేసే టికెట్లు కొనుగోలు చేశారు. ముఖ్యంగా వీఐపీ గ్యాలరీ టికెట్లు కొన్నవారికి ప్రాక్టీస్ రేసు ప్రారంభం అయిన తర్వాత గ్యాలరీలోకి ప్రవేశం లభించకపోవడంతో ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో, రేసు చూసేందుకు టికెట్లు కొన్న వాళ్లకు డబ్బులు వాపస్ ఇస్తున్నట్టు ఇండియన్ రేసింగ్ లీగ్ యాజమాన్యం గురువారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ నెల 19,20 తేదీల్లో టికెట్స్ బుక్ చేసుకున్న వారికి  ఈ విషయమై ఇ–మెయిల్, ఫోన్ సందేశాలు పంపిస్తామని తెలిపింది.

More Telugu News