గుజరాత్ లో బీజేపీకి మద్దతుగా విదేశీయుల ప్రచారం.. టీఎంసీ ఫిర్యాదు

24-11-2022 Thu 12:50
  • బీజేపీ వస్త్రాన్ని ధరించి ప్రచారం చేస్తున్న విదేశీ జాతీయులు
  • నిబంధనలను ఉల్లంఘించినట్టు ఆరోపించిన టీఎంసీ
  • చర్యలు తీసుకోవాలని డిమాండ్
TMC leader demands action against foreigners campaigning for BJP
గుజరాత్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ తరఫున విదేశీయులు పాల్గొనడం వివాదాన్ని రేపుతోంది. దీనిపై ఎన్నికల సంఘానికి తృణమూల్ కాంగ్రెస్ ఇప్పటికే ఫిర్యాదు చేసింది. బీజేపీ శాలువాలతో ప్రచారం చేస్తున్న విదేశీయులపై చర్యలు తీసుకోవాలని టీఎంసీ జాతీయ అధికార ప్రతినిధి సాకేత్ గోఖలే కోరారు. ‘‘మీకు గొప్ప నాయకుడు ఉన్నాడు. మీ నాయకుడిని నమ్మండి’’ అంటూ విదేశీ పౌరులు గుజరాతీలకు సూచిస్తున్న వీడియో బీజేపీ గుజరాత్ విభాగం ట్విట్టర్ పేజీలో దర్శనమిచ్చింది. 

భారత ఎన్నికల ప్రక్రియలో విదేశీయులు పాల్గొనడం ప్రజా ప్రాతినిధ్య చట్టం నిబంధనలు ఉల్లంఘించడమేనని లేఖలో గోఖలే అభ్యంతరం వ్యక్తం చేశారు. చాలా మంది ప్రజలు తమ నాయకుడి గురించి వినడానికి ముందుకు వస్తున్నట్టు ఓ విదేశీ పౌరుడు పేర్కొనడం గమనార్హం. ఎన్నికల ప్రచారానికి విదేశీయులను వాడుకోవడం ద్వారా బీజేపీ నిబంధనలు అతిక్రమించినట్టు టీఎంసీ ఆరోపించింది. దీనిపై ఎన్నికల సంఘం స్పందన ఎలా ఉంటుందో చూడాలి.