సమంత ఆరోగ్యంపై మళ్లీ పుకార్లు.. స్పష్టత నిచ్చిన మేనేజర్

24-11-2022 Thu 11:44
  • హైదరాబాద్ లో ఆసుపత్రిలో చేరిదంటూ వార్తలు
  • ఆమె ఇంటి వద్దనే ఉందని స్పష్టం చేసిన మేనేజర్
  • మయోసైటిస్ వ్యాధితో బాధ పడుతున్న సమంత
Samantha Ruth Prabhu hospitalised in Hyderabad after Myositis diagnosis
దక్షిణాదితో పాటు ఇప్పుడు బాలీవుడ్ నూ తనదైన ముద్ర వేస్తున్న ప్రముఖ నటి సమంత ఆరోగ్యంపై మరోసారి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మయోసైటిస్ అనే రుగ్మతతో బాధపడుతున్న సమంత ఆరోగ్యం క్షీణించిందని సోషల్ మీడియాతో పాటు తమిళ మీడియాలో వార్తలు మొదలయ్యాయి. 

ఈ నేపథ్యంలో సమంత హైదరాబాద్ లో ఓ ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు రావడంతో ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే, సమంతకు ఏమీ కాలేదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. సమంత ఆసుపత్రిలో చేరిందనే వార్తలు పుకార్లే అని కొట్టిపారేశారు. 

ఆమె ఇంటి వద్దనే క్షేమంగా ఉందని సమంత మేనేజర్ కూడా స్పష్టం చేశారు. ఇలాంటి పుకార్లు, తప్పుడు వార్తలను నమ్మొద్దని కోరారు. కాగా, తాను మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్టు సమంత ఇటీవలే స్వయంగా వెల్లడించింది.