హీరోయిన్ కంటే గ్లామరస్ గా కనిపిస్తే అంతే: కల్పిక గణేశ్ 

24-11-2022 Thu 10:53
  • యూత్ లో కల్పిక గణేశ్ కి క్రేజ్
  • 2009లోనే మొదలైన ప్రయాణం  
  • 'యశోద'లో దక్కిన ముఖ్యమైన పాత్ర 
  • అవకాశాలు తగ్గడానికి అదే కారణమన్న కల్పిక 
Kalpika Ganesh Interview
కల్పిక గణేశ్ నటిగా 2009లోనే చంద్రశేఖర్ యేలేటి 'ప్రయాణం' అనే సినిమా ద్వారా పరిచయమైంది. ఆ తరువాత వరుస సినిమాలలో అవకాశాలను దక్కించుకుంటూ వెళుతోంది. ఇక ఇటీవల వెబ్ సిరీస్ ల తోను ఆమె బిజీ అయింది. సినిమాల్లో కాస్త గుర్తింపు దక్కే పాత్రలనే చేస్తూ వెళ్లిన ఆమె, వెబ్ సిరీస్ ల ద్వారా .. సోషల్ మీడియా ద్వారా పాప్యులర్ అయింది. 
 
ఇటీవల 'యశోద' సినిమాలో కల్పిక చేసిన పాత్రకి కూడా మంచి గుర్తింపు వచ్చింది. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. " ఇంతవరకూ ఒక 30 సినిమాలు చేశాను .. వాటిలో 15 మాత్రమే రిలీజ్ అయ్యాయి. కొన్ని సినిమాలు చేసిన తరువాత నన్ను పక్కన పెట్టడం మొదలైంది. హీరోయిన్స్ కంటే బాగా కనిపిస్తున్నాననీ .. బాగా చేస్తున్నానని .. డామినేట్ చేస్తున్నాననేది కారణాలుగా కనిపించాయి. 

నేను చంద్రశేఖర్ యేలేటి గారి స్కూల్ నుంచి వచ్చాను. కానీ అలాంటి వాతావరణం బయట ఎక్కడా  కనిపించలేదు. డైలాగ్ ఉందా అని అడిగితే, 'నీకు కాస్త యాటిట్యూడ్ ఎక్కువ' అనేవారు. కేరక్టర్ ఆర్టిస్టులు వరుస సినిమాలు చేస్తూ వెళుతుంటారు. కానీ మంచి పాత్ర వస్తేనే చేద్దామనే ఒక ఆలోచనే నేను తక్కువ సినిమాలు చేయడానికి కారణమని అనుకుంటున్నాను" అంటూ చెప్పుకొచ్చింది.