ఆ ఫారెస్టులో అంత డీప్ కి వెళ్లింది మేమే: అల్లరి నరేశ్

23-11-2022 Wed 20:09
  • విభిన్న కథా చిత్రంగా 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'
  • మారేడుమిల్లి నేపథ్యంలో నడిచే కథ 
  • అల్లరి నరేశ్ జోడీగా అలరించనున్న ఆనంది
  • చివరి 25 నిమిషాలు కీలకమన్న నరేశ్ 
  • ఈ నెల 25వ తేదీన సినిమా విడుదల  
Allari Naresh Interview
అల్లరి నరేశ్ - ఆనంది జంటగా 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' సినిమా రూపొందింది. సతీశ్ నిర్మించిన ఈ సినిమాకి ఏఆర్ మోహన్ దర్శకత్వం వహించాడు. శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, ఈ నెల 25వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. 

తాజా ఇంటర్వ్యూలో అల్లరి నరేశ్ మాట్లాడుతూ .. "ఈ కథ మొదటి నుంచి చివరి వరకూ చాలా ఇంట్రస్టింగ్ గా కొనసాగుతుంది. క్లైమాక్స్ ఈ సినిమాకి ఆయువు పట్టులాంటిదనే చెప్పాలి. అందువల్లనే చివరి 25 నిమిషాల కోసం మరింత కష్టపడవలసి వచ్చింది. అండర్ వాటర్ లోను కొన్ని దృశ్యాలను చిత్రీకరించడం జరిగింది" అన్నాడు. 

"మారేడుమిల్లి ప్రాంతంలో నెల రోజుల పాటు షూటింగు చేశాము. ఫారెస్టులో 'పుష్ప' టీమ్ వెళ్లినదానికంటే మరింత లోపలికి వెళ్లాము. అంత డీప్ ఫారెస్టులో ఫస్టు షూటింగు చేసింది మేమేనని అక్కడివాళ్లు చెప్పారు. అక్కడ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఉండవు. వాకీ టాకీలు కూడా పనిచేయలేదు. అందువలన కెమెరా దగ్గర నుంచి 'ఎల్లో క్లాత్' ఊపితే నటనలో భాగంగా కొండలపై మా నడక మొదలయ్యేది. 'రెడ్ క్లాత్' కనిపిస్తే 'కట్' అని అర్థం .. ఆగిపోయేవాళ్లం" అంటూ చెప్పుకొచ్చాడు.