'ఇదేం ఖర్మ.. ఆక్వా రైతాంగానికి' సదస్సును విజయవంతం చేయండి: అచ్చెన్నాయుడు

23-11-2022 Wed 12:40
  • చంద్రబాబు హయాంలో ఆక్వా రంగంలో ఏపీ తొలి స్థానంలో ఉండేదన్న అచ్చెన్న 
  • జగన్ సీఎం అయిన తర్వాత ఆక్వా రంగాన్ని ముంచేశారని విమర్శ 
  • ఆక్వా రైతులకు మద్దతుగా రేపు రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహిస్తున్నామని వెల్లడి 
Jagan damaged aqua says Atchannaidu
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశ ఆక్వా రంగంలో ఏపీ తొలి స్థానంలో ఉండేదని... ఇప్పుడు జగన్ చర్యలతో పతనావస్థకు చేరుకుందని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఆక్వా రైతులకు రూ. 1.50కే యూనిట్ విద్యుత్ ను సరఫరా చేస్తానని జగన్ హామీ ఇచ్చారని... అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీని అమలు చేయకుండా, విద్యుత్ కోతలతో ఆక్వా రంగాన్ని నిండా ముంచారని విమర్శించారు. ప్రభుత్వ చర్యలతో ఆక్వా రైతులకు మద్దతు ధర లభించక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. పలు నిబంధనలతో సబ్సిడీలను ఎత్తివేసి ఆక్వా రైతులను వేధిస్తున్నారని దుయ్యబట్టారు. రూ. 5 వేల కోట్ల జేట్యాక్స్ తో ఆక్వా రంగాన్ని నాశనం చేస్తున్నారని అన్నారు. 

సంక్షోభంలో ఉన్న ఆక్వా రైతులకు అండగా నిలిచేందుకు రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు 'ఇదేం ఖర్మ... ఆక్వా రైతాంగానికి' పేరుతో రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహిస్తామని అచ్చెన్న చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆక్వా సంఘాల నేతలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొని సదస్సును విజయవంతం చేయాలని కోరారు. ఈ సదస్సుకు టీడీపీ అధినేత చంద్రబాబు సహా పార్టీకి చెందిన ముఖ్య నేతలు హాజరవుతారని చెప్పారు. ఆక్వా రైతులకు జరుగుతున్న అన్యాయంపై చర్చించి ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తామని తెలిపారు.