రూ.8 లక్షల ఆదాయం ఉన్న వారిని పన్ను నుంచి మినహాయించాలి: మద్రాస్ హైకోర్టులో పిటిషన్

23-11-2022 Wed 12:32
  • ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజ్వేషన్
  • రూ.8 లక్షల ఆదాయ పరిమితిని నిర్ణయించిన కేంద్రం
  • దీన్నే ఆదాయపన్నుకు సైతం ప్రామాణికంగా తీసుకోవాలని కోరిన పిటిషనర్
Exempt All Persons With Less Than Rs 8 Lakhs Annual Income From Income Tax In The Light Of EWS Criteria
ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి కేంద్ర ప్రభుత్వం 10 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్ట్ ఇటీవలే కొట్టివేసింది. రిజర్వేషన్లను సమర్థించింది. అయితే, ఆర్థిక వెనుకబాటు తనానికి కేంద్ర సర్కారు నిర్దేశించిన రూ.8 లక్షల ఆదాయపరిమితి ఇప్పుడు కీలక అంశంగా మారింది. ఒకవైపు రిజర్వేషన్ల కోసం రూ.8 లక్షల వరకు ఆదాయం కలిగిన వారిని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలని చెబుతూ.. మరోవైపు రూ.2.5 లక్షల ఆదాయం దాటిన వారిపై ఆదాయపన్ను ఎలా వేస్తారంటూ మద్రాస్ హైకోర్టులో ఓ పటిషిన్ దాఖలైంది.

జస్టిస్ ఆర్ మహదేవన్, జస్టిస్ సత్యనారాయణ ప్రసాద్ తో కూడిన మద్రాస్ హైకోర్టు ధర్మాసనం దీనిపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి, ఆర్థిక శాఖ, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ విభాగానికి నోటీసులు జారీ చేస్తూ, విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. కన్నూర్ కు చెందిన రైతు, డీఎంకే పార్టీకి చెందిన శ్రీనివాసన్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఫైనాన్స్ యాక్ట్ 2022లోని పారాగ్రాఫ్ ఏ, పార్ట్ 1లోని మొదటి షెడ్యూల్ ను పక్కన పెట్టాలని పిటిషనర్ కోరారు. 

‘‘ఒక కుటుంబ స్థూల ఆదాయం రూ.7,99,999 వరకు ఉంటే ఆర్థికంగా వెనుకబడిన వర్గాల రిజర్వేషన్ ప్రయోజనాన్ని పొందేందుకు అర్హులంటూ ప్రభుత్వం ఆదాయ పరిమితిని నిర్ణయించింది. కనుక ఏటా రూ.7,99,999 ఆదాయం కలిగిన వారి నుంచి ఆదాయపన్ను వసూలు చేయడానికి అనుమతించకూడదు. ఎందుకంటే పన్నులను వసూలు చేసేందుకు అనుసరిస్తున్న విధానంలో హేతుబద్ధత కానీ, సమానత్వం కానీ లేవు’’ అని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 

ఒక వర్గం రిజర్వేషన్లకు అర్హులంటూ.. ఆదాయ పరిమితిని నిర్ణయించిన ప్రభుత్వం, అదే విధానాన్ని సమాజంలోని ఇతర వర్గాలకూ వర్తింపచేయడమే కాకుండా, పన్నులు వసూలు చేయరాదని కోరారు. ఈ కేసులో కోర్టు తీర్పునకు ఎంతో ప్రాధాన్యం ఉండనుంది.