fifa: ఘన విజయంతో ఫిఫా ప్రపంచ కప్ వేట మొదలెట్టిన గత టోర్నీ విజేత

  • 4–1తో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన ఫ్రాన్స్ 
  • రెండు గోల్స్ సాధించిన ఒలీవియర్
  • పలు రికార్డులు బద్దలు కొట్టిన సీనియర్ ఆటగాడు
FIFA World Cup  France start title defence with win over Australia

ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్ లో గత టోర్నీ విజేత ఫ్రాన్స్ శుభారంభం చేసింది. బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో ఫ్రాన్స్ 4–1తో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. ఫ్రాన్స్ ఆటగాడు ఒలీవియర్ గిరౌడ్ పలు రికార్డులు బద్దలు కొడుతూ రెండు గోల్స్ చేసి తమ జట్టును గెలిపించాడు. 36 ఏళ్ల 53 రోజుల వయసున్న గిరౌడ్ ఫిఫా ప్రపంచకప్ లో ఆడిన ఫ్రాన్స్ పెద్ద వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. అలాగే, 51 గోల్స్ తో ఫ్రాన్స్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన క్రీడాకారుడిగా దిగ్గజ ఆటగాడు థియెర్రీ హెన్రీ రికార్డును సమం చేశాడు. 

కాగా, తొలి మ్యాచ్ లో ఆరంభంలోనే ఫ్రాన్స్ వెనుకబడింది. ఆస్ట్రేలియా ఆటగాడు క్రెయిగ్ గుడ్విన్ తొమ్మిదో నిమిషంలోనే గోల్ చేసి ఆస్ట్రేలియాకు ఆధిక్యం అందించాడు. అయితే, 27వ నిమిషంలో గోల్ సాధించిన ఫ్రాన్స్ ఆటగాడు అడ్రియన్ రబియోట్ 1–1తో స్కోరు సమం చేశాడు. ఆపై, 32వ నిమిషంలో ఒలీవియర్ తొలి గోల్ రాబట్టాడు. 68వ నిమిషంలో స్టార్ ప్లేయర్ కిలియన్ ఎంబపే చేసిన గోల్ తో ఫ్రాన్స్ 3–1తో విజయం ఖాయం చేసుకుంది. మూడు నిమిషాలకే ఒలీవియర్ రెండో గోల్ సాధించడంతో ఆ జట్టు ఘన విజయం సొంతం చేసుకుంది.

More Telugu News