ఎమ్మెల్యేలకు ఎర కేసు.. మరో ఇద్దరికి నోటీసులు!

23-11-2022 Wed 11:07
  • నందకుమార్ భార్య చిత్రలేఖ, లాయర్ ప్రతాప్ గౌడ్ కు నోటీసులు
  • ఈరోజు విచారణకు హాజరుకావాలని ఆదేశం
  • ఆచూకీ లేని తుషార్, జగ్గుస్వామి
SIT gives notices to two others in TRS MLAs poaching case
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం దూకుడు పెంచింది. ఈ కేసుతో సంబంధం ఉందన్నట్టుగా భావిస్తున్న మరో ఇద్దరికి నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో ఉన్న నందకుమార్ భార్య చిత్రలేఖ, అంబర్ పేటకు చెందిన న్యాయవాది ప్రతాప్ గౌడ్ కు నోటీసులు ఇచ్చింది. బుధవారంనాడు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. 

మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడు రామచంద్రభారతికి తుషార్, జగ్గుస్వామితో సంబంధాలు ఉన్నట్టు ఆధారాలు లభించడంతో... వారిని విచారణకు పిలిపించేందుకు సిట్ అధికారులు యత్నించారు. అయితే వారిద్దరూ కనపించకపోవడంతో వారిపై లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. వారు దేశం విడిచి పోకుండా అన్ని విమానాశ్రయాలు, ఇమ్మిగ్రేషన్ అధికారులు, అంతర్జాతీయ సరిహద్దుల్లోని అధికారులకు సర్క్యులర్లు పంపారు.