Aaftab: శ్రద్ధ వాకర్ ను తానే చంపానని ఒప్పుకున్న నిందితుడు.. సాక్ష్యంగా పరిగణనలోకి రాదంటున్న నిపుణులు

  • శ్రద్ధ వాకర్ హత్య కేసులో కీలక మలుపు
  • హత్య చేసినట్లు కోర్టులో చెప్పిన అఫ్తాబ్
  • ప్రాథమిక ఆధారాలు దొరకట్లేదని పోలీసుల వెల్లడి
  • హత్యకు ఉపయోగించిన కత్తి కోసం గాలిస్తున్న వైనం
Aaftab Poonawala confessed In Court

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. తనతో సహజీవనం చేసిన శ్రద్ధ వాకర్ ను తానే చంపేసినట్లు అఫ్తాబ్ అమీన్ పూనావాలా కోర్టుకు వెల్లడించాడు. ఇద్దరి మధ్య గొడవ జరగడంతో, మాటా మాటా పెరిగి కోపంలో శ్రద్ధను చంపేసినట్లు వివరించాడు. అదంతా ఆవేశంలో జరిగిపోయిందని చెప్పాడు. పోలీసుల విచారణకు తాను సహకరిస్తున్నానని, తనకు గుర్తున్న వివరాలన్నీ దాచకుండా చెప్పేశానని అఫ్తాబ్ కోర్టుకు తెలిపాడు.

శ్రద్ధను చంపేసినట్లు నిందితుడు తాజాగా కోర్టులో ఒప్పుకున్నప్పటికీ, ఇది అఫ్తాబ్ కు వ్యతిరేకంగా ఉపయోగించుకోలేమని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇది రిమాండుకు సంబంధించిన విచారణ కాబట్టి, కోర్టులో న్యాయమూర్తి ఎదుట చెప్పినప్పటికీ అఫ్తాబ్ నేరాంగీకారం చెల్లదని వివరించారు. ఎందుకంటే, అఫ్తాబ్ ప్రాధమిక నేరాంగీకారం మేజిస్ట్రేట్ సమక్షంలో జరగకపోవడంతో, దానిని సాక్ష్యంగా పరిగణించడం సాధ్యం కాదని అంటున్నారు. 

 మరోవైపు, ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు సేకరించడం చాలా కష్టంగా మారిందని పోలీసులు పేర్కొన్నారు. హత్య జరిగి చాలా రోజులు అవడంతో, హత్యకు ఉపయోగించిన ఆయుధాలు ఇప్పటికీ దొరకలేదని చెప్పారు. కొన్ని దొరికినప్పటికీ వాటిపై ఆధారాలను సేకరించడం కష్టమేనన్నారు. హత్యకు ఉపయోగించిన కత్తి కోసం ఇంకా వెతుకుతున్నట్లు చెప్పారు.

హత్యకు కారణం ఏంటనే విషయంలోనూ గందరగోళం నెలకొందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. శ్రద్ధను కావాలని చంపలేదని, అనుకోకుండా ఆ క్షణంలో ఆవేశం పట్టలేక హత్య చేశానని అఫ్తాబ్ చెబుతున్నాడు. దీంతో అఫ్తాబ్ పై బలమైన ఆరోపణలకు తావులేకుండా పోయిందని చెబుతున్నారు. అయితే, డిజిటల్ ఆధారాల సేకరణ దిశగా దర్యాఫ్తు చేస్తున్నామని ఢిల్లీ పోలీసులు చెప్పారు. శ్రద్ధ స్నేహితులను కలిసి, అఫ్తాబ్ గురించి శ్రద్ధ చేసిన మెసేజ్ లు, ఈ మెయిల్ తదితర డిజిటల్ ఆధారాలను సేకరిస్తున్నారు.

More Telugu News