హైదరాబాద్​ లో దేశంలోనే అతి పెద్ద సినిమా తెర ఏర్పాటు.. ఎక్కడంటే..!

23-11-2022 Wed 10:54
  • ప్రసాద్స్ ఐమాక్స్ లో భారీ స్క్రీన్ సిద్ధం చేస్తున్న యాజమాన్యం
  • 64 అడుగుల ఎత్తు, 101.6 వెడల్పుతో దేశంలో పెద్ద తెరగా రికార్డు
  • వచ్చే నెల 16న అవతార్2 విడుదలయ్యే నాటికి అందుబాటులోకి రానున్న తెర
Hyderabad Prasads Multiplex to get largest screen in country
విదేశాల్లో మాదిరిగా ఇప్పుడు మన దేశంలోనూ మ‌ల్టీప్లెక్స్ కల్చర్ ఎక్కువవుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లకు కాలం చెల్లుతోంది. ప్రేక్షకులు కూడా మల్టీప్లెక్సుల్లో సినిమా చూసేందుకే ఇష్టపడుతున్నారు, రేటు కాస్త ఎక్కువైనా సరే అక్కడికే వెళ్తున్నారు. ఈ క్రమంలో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు మల్టీప్లెక్సులు రకరకాల సౌకర్యాలు కల్పిస్తున్నాయి. హైదరాబాద్ లో మల్టీప్లెక్స్ థియేటర్ అనగానే అందరికీ గుర్తొచ్చేది నెక్లెస్ రోడ్డు పక్కన ఉన్న ప్రసాద్స్ ఐమాక్స్. ఐమాక్స్ లో ఇప్పటికే బిగ్ స్క్రీన్ ఉంది. సిటీలోనే పెద్ద స్క్రీన్ గా దానికి పేరుంది. మరికొన్ని రోజుల్లో ఐమాక్స్ లో దేశంలోనే అతి పెద్ద తెరపై సినిమా చూసే అవకాశం ప్రేక్షకులకు లభించనుంది. 

ఐమాక్స్ లో అతి పెద్ద తెరను యాజమాన్యం సిద్ధం చేసింది. ఈ స్క్రీన్ 64 అడుగుల ఎత్తు, 101.6 అడుగుల వెడల్పుతో ఉంది. దాంతో, ఇది భారత దేశంలో అతి పెద్ద సినిమా తెరగా రికార్డుకెక్కింది. కెనడాకు చెందిన ‘స్ట్రాంగ్ ఎండీఐ’ అనే  ప్రొజెక్షన్ స్ర్కీన్ల తయారీ సంస్థ ప్రత్యేకంగా ఈ తెరను రూపొందించింది. సౌండ్ సిస్టమ్ ను కూడా అత్యుత్తమమైనది ఏర్పాటు చేశారు. డిసెంబర్ 16న అవ‌తార్ 2 విడుదల నాటికి ఈ తెర ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.