HP: పనితీరు ఆధారంగా ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమవుతున్న హెచ్ పీ, గూగుల్

  • 2025 మార్చి నాటికి 12 శాతం మందిని తగ్గించుకోనున్న హెచ్ పీ
  • కంపెనీ సీఈవో మేరీ మయర్స్ ప్రకటన
  • 10,000 మందిని తగ్గించుకోనున్న గూగుల్
HP plans to layoff 12 per cent of its global workforce Google to lay off 10000 employees based on performance

అంతర్జాతీయ ప్రముఖ కంపెనీలన్నీ ఒక్కొక్కటిగా ఉద్యోగులను తొలగించే పనిలో పడ్డాయి. ఇప్పటికే ఫేస్ బుక్, ట్విట్టర్ తదితర సంస్థలు ఉద్యోగులను తొలగించగా.. ప్రముఖ టెక్నాలజీ సంస్థ హెచ్ పీ సైతం 2025 మార్చి నాటికి 12 శాతం మేర ఉద్యోగులను తగ్గించుకోనుంది. ఈ విషయాన్ని కంపెనీ సీఈవో మేరీ మయర్స్ ప్రకటించారు. తద్వారా నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవాలన్నది కంపెనీ ప్రణాళికగా ఉంది. అమెరికా, యూరప్ లో ఆర్థిక మాంద్యం డిసెంబర్ చివరికి లేదంటే వచ్చే ఏడాది ఆరంభం నాటికి రావచ్చన్నది ఆర్థిక వేత్తల అంచనా. ఈ క్రమంలో ప్రముఖ కంపెనీలు ముందు నుంచే ఉద్యోగులను తగ్గించుకోవడంపై దృష్టి సారించాయి. 

12 శాతం అంటే సుమారు 6,000 మంది హెచ్ పీ ఉద్యోగులు ఉపాధి కోల్పోనున్నారు. కంప్యూటర్ విక్రయాలు తగ్గిపోవడంతో సంస్థపై భారం పెరిగేలా చేసింది. ఈ క్రమంలో ఖర్చులను తగ్గించుకోవడం కంపెనీకి ప్రాధాన్యంగా మారింది. మరోవైపు అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ కూడా ఇదే బాటలో నడుస్తోంది. పనితీరు ఆధారిత మదింపులో భాగంగా సుమారు 10,000 మందిని గూగుల్ తొలగించనున్నట్టు తెలుస్తోంది. పనితీరు మదింపు సందర్భంగా తక్కువ స్కోర్ వచ్చిన వారిని రాజీనామా చేయాలని గూగుల్ కోరొచ్చన్నది తాజా కథనం. పనితీరులో బలహీనంగా ఉన్న 6 శాతం మంది లేదా సుమారు 10,000 మందిని షార్ట్ లిస్ట్ చేయాలని గూగుల్ తన మేనేజర్లను కోరినట్టు తెలుస్తోంది. 

More Telugu News