YSRCP: ఆయనంతే! ఎప్పుడూ ఏదో ఒక వివాదం రేపుతూనే ఉంటారు: తండ్రిపై వసంత కృష్ణ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు

Vasantha Krishna Prasad Sensational Comments On Father Vasantha Nageswara Rao
  • తండ్రిని ఆపలేనన్న వసంత కృష్ణ ప్రసాద్
  • మైలవరంలో అభ్యర్థిని మార్చాలనుకుంటే వేరే ఇన్‌చార్జ్‌ను నియమించాలన్న మైలవరం ఎమ్మెల్యే
  • జగన్ నిర్ణయాన్ని శిరసావహిస్తానన్న కృష్ణ ప్రసాద్
తన తండ్రి వసంత నాగేశ్వరరావుపై ఆయన కుమారుడు, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరంలో రెండు రోజుల క్రితం విలేకరులతో మాట్లాడిన వసంత నాగేశ్వరరావు.. రాష్ట్ర రాజధానిగా అమరావతి అనువైన ప్రాంతమని అన్నారు. రూపాయి కూడా తీసుకోకుండా రాజధాని కోసం భూములిచ్చిన 29 గ్రామాల రైతులకు జేజేలు పలుకుతున్నట్టు తెలిపారు. ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం పేరు మార్చినా స్పందించలేని దౌర్భాగ్య స్థితిలో ప్రజలు ఉన్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కమ్మవారు అత్యధికంగా ఉన్న రాష్ట్రంలో ఆ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో స్థానం లభించకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. 

తండ్రి చేసిన ఈ వ్యాఖ్యలపై వసంత కృష్ణ ప్రసాద్ స్పందించారు. తండ్రి వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు చెప్పిన ఆయన.. తన తండ్రి అంతేనని, ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్య చేస్తూనే ఉంటారని అన్నారు. ఆయనను తాను ఆపలేనని వ్యాఖ్యానించారు. వైసీపీ కార్యాలయంలో నిన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని అధిష్ఠానం కోరితే చేస్తానని, లేదంటే పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు.

పార్టీపై తనకు ఎలాంటి అసంతృప్తి లేదని, జగన్ నిర్ణయాన్ని శిరసావహిస్తానని అన్నారు. నియోజకవర్గంలో ఇంటిపోరు సర్దుకుంటుందనే మూడు వారాలుగా విశ్రాంతి తీసుకుంటున్నట్టు చెప్పిన ఆయన.. మైలవరంలో అభ్యర్థిని మార్చాలనుకుంటే నియోజకవర్గానికి వేరే ఇన్‌చార్జ్‌ను నియమించాలని కోరారు. ఎన్నికల వరకు ఆయనతోనే కలిసి తిరుగుతానని, అధిష్ఠానాన్ని కలిసి ఇదే విషయం చెబుతానని కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు.
YSRCP
Vasantha Nageswara Rao
Vasantha Krishna Prasad

More Telugu News