వారాల తరబడి గుండ్రంగా తిరుగుతూ వింతగా ప్రవర్తిస్తున్న చైనా గొర్రెలు.. వీడియో ఇదిగో!

23-11-2022 Wed 07:12
  • 12 రోజులుగా అలుపు సొలుపు లేకుండా తిరుగుతున్న గొర్రెలు
  • వీడియోను షేర్ చేసిన చైనా అధికారిక మీడియా
  • ‘సర్కిలింగ్’ వ్యాధిగా అనుమానం
  • అది సోకితే 48 గంటల్లోనే మరణిస్తాయంటున్న నిపుణులు
  • వారాల తరబడి తిరుగుతూ ఆరోగ్యంగా ఉండడం వింతేనంటున్న ప్రొఫెసర్ మ్యాట్‌బెల్
Mystery Behind Sheep Walking In Circle In China
చైనాలో గొర్రెలు గుండ్రంగా తిరుగుతూ వింతగా ప్రవర్తిస్తున్నాయి. గత 12 రోజులుగా అలుపు సొలుపు లేకుండా తిరుగుతున్న వీటిని చూస్తున్న వారు ఆశ్చర్యపోతున్నారు. గొర్రెలు గుండ్రంగా తిరుగుతున్న వీడియోను చైనా అధికారిక మీడియా తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది. ఇన్నర్ మంగోలియాకు చెందిన ఓ వ్యక్తి వందల సంఖ్యలో గొర్రెలు పెంచుతున్నాడు. ఈ నెల మొదటి వారంలో వాటి ప్రవర్తనలో మార్పు వచ్చింది. అన్నీ ఒకచోట చేరి వృత్తాకారంలో తిరగడం మొదలుపెట్టాయి. 

తొలుత కొన్ని గొర్రెలు ఇలా రౌండ్‌గా తిరగడం మొదలుపెట్టాయి. ఆ తర్వాత మరికొన్ని వాటికి తోడయ్యాయి. ఇప్పుడు ఆ మందలోని గొర్రెలన్నీ ఇలా వృత్తాకారంలో తిరుగుతూ ఆశ్చర్యపరుస్తున్నాయి. నవంబరు 4న మొదలైన ఈ వింత ప్రవర్తన ఈ నెల 16న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసే వరకు కొనసాగింది. అయితే, ఇప్పుడు కూడా అవి అలాగే ప్రవర్తిస్తున్నాయా? లేదా? అన్న విషయం తెలియరాలేదు. అయితే, గొర్రెలు ఇలా వృత్తాకారంలో తిరుగుతూ వింతగా ప్రవర్తిస్తుండడానికి లిస్టెరియోసిస్ బ్యాక్టీరియా కారణం కావొచ్చని అంటున్నారు. ఇది సోకితే ‘సర్క్‌లింగ్’ వ్యాధి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

మెదడులో ఓ వైపు దెబ్బతినడం వల్ల అవి వింతగా ప్రవర్తిస్తాయని పేర్కొన్నారు. ఈ వ్యాధి సోకిన గొర్రెలు 48 గంటల్లోనే మరణిస్తాయి. అయితే, ఇవి మాత్రం వారాలు దాటుతున్నా ఆరోగ్యంగా ఉండడంతో దీనికి సోకింది ఆ వ్యాధి కాకపోవచ్చని కూడా అంటున్నారు. ఇతర జంతువుల వేట నుంచి తప్పించుకుని, తమ సమూహాన్ని రక్షించుకునేందుకు గొర్రెలు తమ ముందున్న వాటిని అనుసరిస్తాయని, కాకపోతే ఇలా వారాల తరబడి తిరగడం మాత్రం ఆశ్చర్యమేనని ఇంగ్లండ్‌లోని హార్ట్‌ప్యూరీ యూనివర్సిటీలోని వ్యవసాయ విభాగాధిపతి ప్రొఫెసర్ మ్యాట్‌బెల్ పేర్కొన్నారు.