కష్టపడటం వల్లనే సుధీర్ కి అదృష్టం కలిసొచ్చింది: తమ్మారెడ్డి

22-11-2022 Tue 21:19
  • ఈ నెల 18న విడుదలైన 'గాలోడు' 
  • సుధీర్ జోడీగా మెరిసిన గెహనా సిప్పి
  • కొంతసేపటి క్రితం జరిగిన సక్సెస్ మీట్ 
  • సుధీర్ కష్టం కనిపించిందన్న తమ్మా రెడ్డి   
Gaalodu success meet
సుడిగాలి సుధీర్ హీరోగా 'గాలోడు' సినిమా రూపొందింది. సంస్కృతి బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి, రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. సుధీర్ జోడీగా గెహెనా సిప్పి నటించిన ఈ సినిమా, ఈ నెల 18వ తేదీన థియేటర్లకు వచ్చింది. మంచి వసూళ్లను రాబడుతుందంటూ, కొంతసేపటి క్రితం సక్సెస్ మీట్ ను నిర్వహించారు. 

ఈ వేదికపై తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ .. "ఈ సినిమాలో ఓ చిన్న వేషం వేయాలని నా దగ్గరికి వచ్చారు. టైటిల్ బాగో లేదు .. నేను చేయను అన్నాను. డైరెక్టర్ పట్టుబట్టడంతో ఒప్పుకున్నాను. నా పైన ఒక సీన్ చేస్తున్నప్పుడే, అందులో మంచి కంటెంట్ ఉందనిపించింది. అతను చేసిన మేజిక్ వల్లనే ఈ రోజున ఈ సినిమా సక్సెస్ అయింది" అన్నారు. 

" కష్టాన్ని నమ్ముకున్నవాడికే అదృష్టం కలిసొస్తుందని ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంది. సుధీర్ తన కష్టాన్ని నమ్ముకున్నందు వల్లనే అదృష్టం కలిసొచ్చింది. ఎన్టీఆర్ .. అల్లు అర్జున్ మాదిరిగా కష్టపడే తత్వం సుధీర్ లో కనిపించింది. నేను పొగడడం లేదు .. నాకు అనిపించింది చెబుతున్నాను. నేను నటించిన సినిమా సక్సెస్ కావడం నాకు ఆనందాన్ని కలిగించే విషయం" అంటూ చెప్పుకొచ్చారు.