Airtel: ఎయిర్ టెల్ మరోసారి బాదుడు.. నెలవారీ కనీస రీచార్జ్ రూ.155

Airtel increases price of its cheapest plan now costs Rs 155
  • హర్యానా, ఒడిశా సర్కిళ్లలో రూ.99 ప్లాన్ ఎత్తివేత 
  • దీంతో అక్కడ యూజర్లు నెలకు రూ.155 ఖర్చు చేయాల్సిందే
  • ఫలితాలను చూసి దేశవ్యాప్తంగా అమలు చేసే యోచన
ఎయిర్ టెల్ చెప్పినట్టే చేస్తుంది. నెలవారీ ఒక యూజర్ నుంచి తమకు సగటున రూ.200లోపు వస్తే మిగిలేది ఏమీ ఉండదని ఈ సంస్థ ఎప్పటి నుంచో చెబుతోంది. కానీ, వాస్తవం వేరు. ఇప్పటికే పలు విడతల పెంపుతో ఈ సంస్థకు ఒక్కో యూజర్ నుంచి ప్రతి నెలా రూ.190 చొప్పున ఆదాయం వస్తోంది. సెప్టెంబర్ క్వార్టర్లో అంటే మూడు నెలలకు ఈ సంస్థకు వచ్చిన లాభం రూ.950 కోట్లు. ఈ లాభం కూడా కేవలం భారత్ లో టెలికం సేవల నుంచి వచ్చినది మాత్రమే. డిష్ టీవీ, ఆఫ్రికా సేవల నుంచి వచ్చిన లాభాలు వేరే ఉన్నాయి. అయినా, తమకు ఏమీ మిగలడం లేదంటూ ఎయిర్ టెల్ వీలైనప్పుడల్లా కస్టమర్లను బాదే పని పెట్టుకుంది.

ఇప్పుడు ఎయిర్ టెల్ నెట్ వర్క్ లో.. కాల్స్ చేసుకున్నా, చేసుకోకపోయినా నెలవారీ కనీసం రూ.99 ప్రీపెయిడ్ రీచార్జ్ చేసుకోవాలి. పైగా ఇందులో ఒక్క ఎస్ఎంఎస్ కూడా రాదు. కేవలం టాక్ టైమ్, 200 ఎంబీ డేటా వస్తుంది. ఎస్ఎంఎస్ లు కూడా కావాలనుకుంటే రూ.155 ప్లాన్ రీచార్జ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎయిర్ టెల్ ఒక ప్రయోగం చేసింది. కేవలం హర్యానా, ఒడిశా సర్కిళ్లలో రూ.99 నెలవారీ ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్ ఎత్తేసింది. ఇప్పుడు ఆ సర్కిళ్లలో ప్రారంభ రీచార్జ్ ప్లాన్ రూ.155. 

ఎక్కడో హర్యానా, ఒడిశాలో చేస్తే మనకెందుకులే? అనుకోవద్దు. ఎందుకంటే ఒడిశా, హర్యానాలో ఎయిర్ టెల్ కు మొత్తం కస్టమర్లలో కేవలం 5 శాతం మందే ఉన్నారు. అక్కడ ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేసి చూసి.. కస్టమర్ల స్పందన ఆధారంగా దేశవ్యాప్తంగా అన్ని సర్కిళ్లలో అమలు చేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. లోగడ కూడా ఎయిర్ టెల్ ఇలాంటి ప్రయోగాలు చేయడాన్ని గుర్తు చేస్తున్నారు. అన్ని సర్కిళ్లలో కనుక ఇదే అమలైతే సాధారణ యూజర్లపై మరింత భారం పడుతుంది.
Airtel
prepaid plans
minimum recharge
hikes
Rs 155

More Telugu News