నేడు విశాఖకు వెళుతున్న కిషన్ రెడ్డి.. ఎయిర్ పోర్ట్ వద్ద హైఅలర్ట్

22-11-2022 Tue 09:04
  • సింహాద్రి ఎన్టీపీసీని సందర్శించనున్న కిషన్ రెడ్డి
  • నేటితో 600వ రోజుకు చేరుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల దీక్షలు
  • కిషన్ రెడ్డికి నిరసనలు ఎదురయ్యే అవకాశం
Alert at Vizag airport amid Kishan Reddy visit
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు విశాఖ పర్యటనకు వెళ్తున్నారు. విశాఖలోని సింహాద్రి ఎన్టీపీసీని ఆయన సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ ఎయిర్ పోర్ట్ వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేసి, హైఅలర్ట్ ప్రకటించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల నిరసనల నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. 

జీవీఎంసీ చౌక్ వద్ద స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు నేటితో 600వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు ఈరోజు బహిరంగసభను నిర్వహిస్తున్నారు. ఈ సభకు పలు పార్టీలు, సంఘాల నేతలు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో కిషన్ రెడ్డికి నిరసనలు ఎదురయ్యే అవకాశం ఉండటంతో పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. నేషనల్ హైవేపై ప్రతి వాహనాన్ని తనిఖీ చేసిన తర్వాతే ముందుకు అనుమతిస్తున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేయాలని కేంద్ర నిర్ణయించినప్పటి నుంచి దీక్షలు కొనసాగుతున్నాయి.