ఇండోనేషియాలో విరుచుకుపడిన భూకంపాలు.. 162కి పెరిగిన మృతుల సంఖ్య
- 10 గంటల వ్యవధిలో 62 సార్లు కంపించిన భూమి
- 1.5 నుంచి 4.8 తీవ్రతతో పలుమార్లు భూ ప్రకంపనలు
- మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్న అధికారులు
- ఆసుపత్రులు ధ్వంసం కావడంతో వీధుల్లోనే చికిత్స
భూకంపం కారణంగా 162 మంది మరణించినట్టు ఇండోనేషియా జాతీయ విపత్తుల సంస్థ ప్రకటించింది. 700 మందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో చిన్నారులు ఎక్కువగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. భూకంపం ధాటికి సియాంజుర్‌లో ఓ స్కూలు, ప్రాంతీయ ఆసుపత్రి, ప్రభుత్వ కార్యాలయాలు, ఓ ప్రార్థనా మందిరం, మూడు పాఠశాలల గోడలు కుప్పకూలాయి. వందల సంఖ్యలో ఇళ్లు, అపార్ట్‌మెంట్లు దెబ్బతిన్నాయి. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండొచ్చని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. మృతుల సంఖ్య పెరగడానికి వరుస భూ ప్రకంపనలే కారణమని అధికారులు పేర్కొన్నారు. ఆసుపత్రులు ధ్వంసం కావడంతో వీధుల్లోనే వైద్యులు చికిత్స అందిస్తున్నారు.