రాజీవ్ హత్య కేసు దోషుల విడుదలపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న కాంగ్రెస్ పార్టీ

21-11-2022 Mon 17:33
  • 1991లో రాజీవ్ దారుణ హత్య
  • 32 ఏళ్లుగా జైలులో నళిని తదితరులు
  • సుప్రీం ఆదేశాలతో వేలూరు జైలు నుంచి విడుదలైన రాజీవ్ హత్య దోషులు
  • రివ్యూ పిటిషన్ వేయాలని కాంగ్రెస్ యోచన
Congress party ready to takes on Supreme Court decision on Rajiv Gandhi killing convicts release
దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసు దోషులను ఇటీవల తమిళనాడులోని వేలూరు జైలు నుంచి విడుదల చేయడం తెలిసిందే. అయితే, రాజీవ్ హత్య దోషులను విడుదల చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయనుంది. సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని ఈ పిటిషన్ లో కోరనుంది. 

కాగా, రాజీవ్ హంతకుల విషయంలో గాంధీ కుటుంబం మౌనంగా ఉన్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ మాత్రం దోషుల విడుదలను తీవ్రంగా పరిగణిస్తోంది. మాజీ ప్రధానిని హత్య చేసిన వారికి శిక్ష తగ్గించి, విడుదల చేయడం విచారకరం అని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో, మరో వారం రోజుల్లో సుప్రీంకోర్టులో కాంగ్రెస్ వర్గాలు రివ్యూ పిటిషన్ దాఖలు చేయనున్నాయి. 

అటు, దోషుల విడుదలపై సుప్రీంకోర్టు తీర్పును కేంద్రం, బీజేపీ నేతలు కూడా వ్యతిరేకిస్తుండడం గమనార్హం. ఈ తీర్పును పునఃపరిశీలించాలంటూ కేంద్రం ఇప్పటికే సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది.

రాజీవ్ హత్య కేసులో దోషులుగా నిర్ధారణ అయిన నళిని, ఆమె భర్త శ్రీహరన్, రాబర్ట్ పయస్, రవిచంద్రన్, జయకుమార్, సంథన్ లను విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశాలు ఇచ్చింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో వారికి 32 ఏళ్ల సుదీర్ఘ జైలు జీవితం నుంచి విముక్తి లభించింది.