ఇన్నోవాలో కొత్త వెర్షన్ తీసుకువస్తున్న టయోటా

21-11-2022 Mon 16:21
  • భారత్ లో రంగప్రవేశం చేస్తున్న ఇన్నోవా హైక్రాస్
  • ఇప్పటికే ఇండోనేషియా మార్కెట్లో విడుదల
  • ఇన్నోవా క్రిస్టాతో పోల్చితే పెద్ద సైజు
  • పూర్తిస్థాయి ఎస్ యూవీ తరహా డిజైన్
Toyota brings hybrid tech powered Innova Hycross in India
జపనీస్ కార్ల తయారీ దిగ్గజం టయోటా భారత్ లో ప్రవేశపెట్టిన మోడళ్లలో ఇన్నోవా అత్యంత ప్రజాదరణ పొందింది. దృఢమైన బాడీ, విశాలమైన ఛాసిస్, ఆకట్టుకునే డిజైన్ తో కనిపించే ఇన్నోవా వాహనం టయోటాకు భారత మార్కెట్ పై పట్టు అందించింది. 

ఇప్పుడు ఇన్నోవాలో కొత్త వెర్షన్ ను తీసుకువచ్చేందుకు టయోటా సన్నాహాలు చేస్తోంది. దీనిపేరు ఇన్నోవా హైక్రాస్. దీంట్లో హైబ్రిడ్ టెక్నాలజీ ఉపయోగించారు. టయోటా ఇన్నోవా హైక్రాస్ ఇప్పటికే ఇండోనేషియా మార్కెట్లో అడుగుపెట్టింది. భారత్ లో ఈ ఆధునిక తరం మోడల్ ను నవంబరు 25న ఆవిష్కరించనున్నారు. 

ఈ నయా వెర్షన్ కారు డిజైన్ పరంగా పూర్తిస్థాయిలో ఎస్ యూవీని తలపించనుంది. ఇన్నోవా క్రిస్టాతో పోల్చితే హైక్రాస్ పెద్దది. లార్జ్ ఫ్రంట్ గ్రిల్, షార్ప్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, దృఢమైన బంపర్, 18 అంగుళాల టైర్లతో వస్తోంది. ఇన్నోవా గత మోడళ్లతో పోల్చితే హైక్రాస్ లో క్యాబిన్ ను పూర్తిగా రీడిజైన్ చేశారు. 

10 అంగుళాల ఇన్ఫోటైన్ మెంట్ స్క్రీన్, కొత్త తరహా స్టీరింగ్ వీల్, లార్జ్ పనోరమిక్ సన్ రూఫ్, యాంబియెంట్ లైటింగ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఏర్పాటు చేశారు. కేవలం 2.0 లీటర్ పవర్ ఫుల్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తోంది. డీజిల్ వెర్షన్ కు సంబంధించిన సమాచారం లేదు. దీని ధర, ఇతర ఫీచర్లు త్వరలోనే వెల్లడి కానున్నాయి.