నగరం నడిబొడ్డున కార్ల రేసులు నిర్వహిస్తారా?: బండి సంజయ్

20-11-2022 Sun 20:22
  • హైదరాబాదులో ఇండియన్ రేసింగ్ లీగ్ 
  • విమర్శనాస్త్రాలు సంధించిన బండి సంజయ్
  • తాము ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా రేసులు నిర్వహిస్తామని వెల్లడి
Bandi Sanjay comments on Indian Racing League
హైదరాబాదులోని హుస్సేన్ సాగర్ తీరంలో ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్ఎల్) నిర్వహించడం పట్ల తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ విమర్శనాస్త్రాలు సంధించారు. నగరం నడిబొడ్డున కార్ల రేసులు నిర్వహిస్తారా? అని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తే ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా కార్ల రేసింగ్ నిర్వహిస్తామని అన్నారు. కార్ల రేసింగ్ కు ఖర్చు చేసే ప్రతి పైసా, వసూళ్ల వివరాలను పారదర్శకంగా వెల్లడిస్తామని తెలిపారు. 

బండి సంజయ్ ఇవాళ శామీర్ పేటలో బీజేపీ శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో బీజేపీకి 2 ఎంపీ సీట్లు ఉంటే నేడు 303 స్థానాలను గెలిచే స్థాయికి ఎదిగిందని అన్నారు. అయితే అడ్డదారుల్లో అధికారంలోకి రావాలని బీజేపీ ఎప్పుడూ కోరుకోదని స్పష్టం చేశారు.