పదో తరగతి, డిప్లొమా అర్హతతో.. ఏపీలో ఉద్యోగాలు

20-11-2022 Sun 11:34
  • రాతపరీక్ష లేకుండానే ఎంపిక
  • వైఎస్సార్ అర్బన్ క్లినిక్ లలో నియామకం
  • విద్యార్హతలు, అనుభవం ఆధారంగా అపాయింట్ మెంట్
DMHO East Godavari Recruitment 2022
తూర్పు గోదావరి జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే అర్బన్ క్లినిక్ లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వైఎస్సార్ అర్బన్ క్లినిక్, యూపీహెచ్ సీ ఆసుపత్రులలో ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, లాస్ట్ గ్రేడ్ సర్వీస్ పోస్టుల భర్తీకి అర్హుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఖాళీగా ఉన్న 21 పోస్టులను ఒప్పంద, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన తీసుకోనున్నట్లు తెలిపింది. దరఖాస్తు చేసుకునే పోస్టుకు తగినట్లుగా.. గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుంచి పదో తరగతి, డీఎంఎల్‌టీ, బీఎస్సీ (ఎంఎల్‌టీ), డిగ్రీ, డిప్లొమా, డీఫార్మసీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలని పేర్కొంది. వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలని, సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలని పేర్కొంది.

అభ్యర్థులు తమ దరఖాస్తులను పోస్టు ద్వారా 26 నవంబర్ 2022 తేదీలోగా పంపించాలని సూచించింది. విద్యార్హతలు, అనుభవం, రిజర్వేషన్‌ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. నెలాఖరున సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించి, మెరిట్ లిస్టును డిసెంబర్ 5న విడుదల చేస్తామని అధికారులు పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు డిసెంబర్ 7న నియామక పత్రాలను అందజేయనున్నట్లు వివరించారు.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా.. మేనేజ్ మెంట్ యూనిట్(డీపీఎంయూ), నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ (డాక్టర్ వైఎస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్/ యూపీహెచ్ సీ), తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్టం.

ఉద్యోగ ఖాళీలు..
ల్యాబ్ టెక్నీషియన్ : 4, ఫార్మసిస్ట్ : 6, డేటా ఎంట్రీ ఆపరేటర్ : 4, లాస్ట్ గ్రేడ్ సర్వీస్ : 7