West Bengal: రేషన్ కార్డులో తప్పుగా నమోదైన పేరు.. కుక్కలా అరుస్తూ నిరసన తెలిపిన యువకుడు: వీడియో ఇదిగో!

  • పశ్చిమ బెంగాల్‌లోని బంకురా జిల్లాలో ఘటన
  • రేషన్ కార్డులో దుత్తాకు బదులుగా కుత్తా అని ముద్రణ
  • అధికారి ఎదుట కుక్కలా అరుస్తూ  పేరు మార్చాలని అర్జీ
Name In Ration Card Spelt Kutta Man Barks Like Dog In Protest

రేషన్ కార్డులో తన ఇంటి పేరు దుత్తాకు బదులుగా ‘కుత్తా’ అని తప్పుగా నమోదు కావడంతో ఓ వ్యక్తి కుక్కలా మొరుగుతూ ఉన్నతాధికారి ఎదుట నిరసన తెలిపాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పశ్చిమ బెంగాల్‌ బంకురా జిల్లాలోని ఓ గ్రామంలో జరిగిందీ ఘటన. ‘గడప వద్దకే ప్రభుత్వం’ పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ హాజరయ్యారు. ఆయన కారు వద్దకు చేరుకున్న శ్రీకాంతి కుమార్ దుత్తా కుక్కలా అరుస్తూ కొన్ని పత్రాలు సమర్పించారు. వాటిని తీసుకున్న అధికారి సమస్యను పరిష్కరించాల్సిందిగా అధికారులకు ఆ పత్రాలను సమర్పించారు.

ఇంతకీ ఏం జరిగిందంటే.. శ్రీకాంతి కుమార్ దుత్తా పేరును రేషన్ కార్డులో శ్రీకాంతి కుమార్ కుత్తాగా ముద్రించారు. హిందీలో కుత్తా అంటే కుక్క కావడంతో కార్డులో తప్పుగా ప్రింట్ అయిన తన పేరును మార్చాలని కుక్కలా అరుస్తూ అధికారికి అర్జీ పత్రాలు సమర్పించాడు. తన పేరు ఇలా తప్పుగా ప్రింట్ కావడం ఇదే తొలిసారి కాదని ఈ సందర్భంగా శ్రీకాంతి కుమార్ పేర్కొన్నాడు. తొలిసారి అతడి పేరును శ్రీకాంత మొండల్ అని రాశారట. దీంతో తప్పును సరిచేయాలని అర్జీ పెట్టుకుంటే దానిని శ్రీశాంతో దుత్తాగా మార్చారు. ఆ తర్వాత మరోసారి శ్రీకాంత్ కుమార్ కుత్తా అని మార్చారు. దీంతో విసిగిపోయిన ఆయన ఇక లాభం లేదని ఇలా వినూత్నంగా నిరసన తెలిపి తన బాధను అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు.

More Telugu News